రజనీకాంత్ భార్య వద్ద డబ్బు లేదా..?


 

సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతా వద్ద డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా..? భర్త రజనీకాంత్ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. అలాంటి వారి వద్ద డబ్బు లేదంటే ఎలా..? ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాం అంటే. లతా రజనీకాంత్ చెన్నైలోని గిండీలో ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్కూలు మూతబడింది. అందుకు కారణం భవనానికి అద్దె చెల్లించకపోవడమే. స్కూలు భవనానికి రజనీకాంత్ భార్య అద్దె సరిగా చెల్లించడం లేదని 2011లో భూస్వామి కోర్టులో సివిల్ సూట్ వేశారు. ఇప్పటికీ కోర్టులో ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇదొక్కటే కాదు గత ఆరు నెలల నుంచి తమ జీతాలు కూడా చెల్లించడం లేదని కొద్ది రోజుల క్రితం టీచర్లు ఆందోళన చేశారు. అయినప్పటికీ ఎలాగో నెట్టుకొస్తున్న యాజమాన్యానికి నిర్వహణ తలకు మించిన భారం కావడంతో పాఠశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అందులో చదువుకుంటున్న సుమారు 300 మంది విద్యార్థులను మరో చోటికి తరలించారు.