బీజేపీపై రజనీ కామెంట్లు.. అందుకేనా..!

 

గత కొద్దికాలంగా బీజేపీ పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సందు దొరికినప్పుడల్లా బీజేపీపై మోడీపై తెగ విమర్సలు చేసేశారు ప్రకాశ్ రాజ్. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ డ్రామాపై స్పందిస్తూ బీజేపీ పై కామెంట్లు విసిరారు. అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇక జేడీఎస్ మద్దతు కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్,బీజేపీ బాగానే ప్రయత్నాలు చేసింది. అయితే జేజీఎస్ కాంగ్రెస్ కు మద్దతిచ్చి బీజేపీకి షాకిచ్చింది. దీంతో బీజేపీ ఎలాగైనా తమకు కావాల్సిన ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక గవర్నర్ ను అడ్డుపెట్టుకొని కూడా అధికారం చేపట్టాలని చూసింది. కానీ ఆ పప్పులేమి ఉడకలేదు. సుప్రీంకోర్టు బీజేపీ అడిగిన వారం రోజులు గడువు ఇవ్వకుండా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చి బలపరీక్ష చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ నేతలతో బేరసారాలు కూడా చేశారు బీజేపీ నేతలు. ఇక బలపరీక్ష కొద్దిసేపట్లో జరుగుతుంది అన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు చాలా తెలివిగా ఈ ఆడియో టేపులను కాస్త బయటపెట్టింది. ఈ ఆడియో టేపుల్లో స్వయంగా యడ్యూరప్ప పేరే బయటకు రావడంతో బీజేపీకి అసలు సమస్య వచ్చిపడింది. ఇలా చేసినందుకు మోడీ, షా ద్వయం యడ్యూరప్పపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేసేది లేక రాజీనామా చేయమని ఆదేశించడంతో.. బలపరీక్షకు ముందే యెడ్డీ రాజీనామా చేశారు. ఇక యెడ్డీ రాజీనామాతో బలపరీక్ష చేసే పని తప్పింది. కాంగ్రెస్, జేడీఎస్ ఒప్పందం ప్రకారం కుమారస్వామి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

ఇక గత వారంరోజులుగా జరిగిన కర్ణాటక రాజకీయాలపై రజనీకాంత్ మాట్లాడుతూ... కర్ణాటకలో జరిగిన అన్యూహ్య సంఘటనను చూసి ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకున్నా.. బలనిరూపణలో నెగ్గడానికి గవర్నర్ 15 రోజులు సమయం ఇవ్వడం, అందుకు భాజపా మరింత సమయం కోరడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టుగా ఉంది.. బల నిరూపణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ధన్యవాదాలు.. ఆతీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది అని అన్నారు. ఇక రజనీ చేసిన వ్యాఖ్యలను బట్టి తాను కూడా బీజేపీకి వ్యతిరేకమని చెప్పకనే చెప్పారని అంటున్నారు పలువురు. అంతేకాదు రజనీ బీజేపీ పై కోపంగా ఉండటానికి వేరే కారణం ఉందని కూడా అంటున్నారు. అది ఏంటంటే.. ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న వ్యాఖ్యలే రజనీ బీజేపీ అంటే మండిపడటానికి కారణం అంటున్నారు. స్వామిగారు రజనీపై మామూలు కామెంట్లు వేయలేదు మరి. రజనీకి చదువు లేదని.. ఆయన రాజకీయాలకు పనికిరాడని... అతనితో పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద నష్టం ఇంకేం లేదు... సినీ తారలకు రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ రోజులు ఎప్పుడో పోయాయని.. సినిమా తారలతో అలయెన్స్ అంటే అది అతిపెద్ద వైఫల్యమే అని తెగ విమర్శలు గుప్పించారు. ఈ కారణం కూడా బీజేపీపై రజనీ కోపంగా ఉండటానికి ఒక రీజన్ అంటున్నారు విశ్లేషకులు. దానికితోడు ఈ మధ్య కాలంలో బీజేపీ పై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఈ కారణాలవల్లే రజనీ కూడా ఇప్పుడు ఓపెన్ గానే బీజేపీ పై కామెంట్లు చేశారని... దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోను అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...