కామెడీ సినిమా మాదిరి.. తమిళ రాజకీయం!

తమిళనాట రాజకీయాలు రోజుకో తీరుగా మారుతున్నాయ్. నటులుగా కలిసి ఎదిగిన కమల్ హాసన్, రజనీకాంత్... ‘రాజకీయం’ అనేసరికి ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకుంటున్నారు. దాంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చాలామంది నాయకులు రంగులు మార్చుకోడానికి రెడీగా ఉన్నారని సమాచారం. అయితే రజనీ... అభిమానులతో మీటింగులూ.. గట్రా పెట్టుకుంటూ బిజీగా ఉన్నారు కానీ... తన రాజకీయ పార్టీకి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు చెప్పడంలేదు. అంతేకాదు... అసలు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇప్పటివరకూ మీడియా ముందు ఆయన చెప్పకపోవడం గమనార్హం. రజనీ వేస్తున్న అడుగులు మాత్రం రాజకీయం వైపే అని చెప్పకనే చెబుతున్నాయ్. అయితే... తాను సొంత పార్టీ పెడతాడా? లేక బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ తరఫున సీఎం కేండిడేట్ గా నిలబడతాడా? అనేది తెలియాల్సి వుంది. 

 

ఇక కమల్ హాసన్.. ఇప్పటికే తన రాజకీయ అరంగేట్రం గురించి క్లారిటీ ఇచ్చేశాడు. తాను సొంత పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ప్రకటించాడు. నవంబర్ లో పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని తేల్చిచెప్పాడు. అంతేకాదు... అప్పుడే ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు గుప్పించడం కూడా మొదలుపెట్టేశాడు. మొదట్నుంచి కమల్‌ది కాస్త దుందుడుకు స్వభావం. వామపక్ష భావజాలం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ దూకుడు.. కమల్ స్టేట్మెంట్లలో కనిపిస్తుంది కూడా. 

 

వీరిద్దరి నిర్ణయంపై అభిమానులు ఆనందంగా ఉన్నా... విశ్లేషకులు మాత్రం దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే సంస్థాగతంగా బలమైన డీఎంకే, అన్నాడిఎంకే పార్టీలను ఎదిరించి నిలవడం తేలికైన విషయం కాదు. అయితే... వీరిద్దరి అభిమాన గణం కూడా తక్కువది కాదు. అంతేకాదు... వయసుతో నిమిత్తం లేకుండా అందరి అభిమానాన్నీ పొందిన నటులు ఇద్దరూ. వీరు విడివిడిగా పోటీ చేస్తే... కేవలం కింగ్ మేకర్లుగానే నిలిచిపోతారు. అదే... ఇద్దరూ కలిసి పార్టీ స్థాపించి... ఒకే పార్టీతో జనాల్లోకెళ్తే.. ప్రస్తుత అధికార, ప్రతిపక్ష పార్టీలు మట్టికరవడం ఖాయం అని విశ్లేషకుల అంచనా. అయితే... రజనీ, కమల్ అభిప్రాయాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయ్. 

 

ఇదిలావుంటే... ఉన్న వేడి చాలదన్నట్లు... నటి సుహాసిని కూడా రాజకీయాల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసి.. ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపారు. ‘జయలలితకు ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఆమె నిలబెట్టుకున్నారు కూడా. అలాగే మాకూ ఇవ్వండి. మేం రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగానే ఉన్నాం. మగవాళ్లే రాజకీయాల్లోకి రావాలా? ఆడవారు రాకూడదా? హీరోలే పార్టీలు స్థాపించాలా? హీరోయిన్లు కొత్త పార్టీని స్థాపించకూడదా?’ అని సుహాసిని మాట్లాడిన తీరు ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఇప్పటికే కథానాయికల్లో ఖుష్బూ... కాంగ్రెస్ నాయకురాలిగా బిజీ బిజీగా ఉంది. మరోవైపు రాధిక, రేవతి, నదియా తదితర హీరోయిన్లు కూడా రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుహాసిని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయ్. ఈ సీనియర్ నటీమణులకు కూడా పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా? లేక ఉన్న పార్టీల్లోనే చేరి.. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడతారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

 

మొత్తానికి తమిళ రాజకీయాలు కామెడీ సినిమాను తలపిస్తున్నాయ్. ఇప్పుడు అక్కడ సినిమా వాళ్లందరూ రాజకీయ నాయకులే. బహుశా ఈ వాతావరణమే.. 40 ఏళ్ల క్రితం ఉంటే... ఎన్టీయార్, ఎమ్జీయార్ రాజకీయాల్లోకే వచ్చేవారు కాదేమో!