తెలంగాణా సీఎస్ ఇంట్లో తాచుపాము...వెళ్లి బందించిన హోం ప్రిన్సిపల్ సెక్రటరీ

 

మామూలుగా మన ఇంట్లో పాము దూరితే ఏం చేస్తాం ? అది కూడా ప్రమాదకరమైన విషపూరిత తాచుపాము అయితే. అమ్మో ఇంకేమన్నా ఉందా ? పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపిస్తుందా ? అయితే తెలంగాణా రాష్ట్ర ముఖ్య అధికారి ఒకరింట్లోకి పాము  వచ్చిందన్న సమాచారం అందుకున్న మరో ముఖ్యాధికారి వెంటనే వెళ్లి దాన్ని బందించేశారు. ఈ ఘటనకి సంబందించిన పూర్తి వివరాల్లోకి వస్తే తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషి హైదరాబాద్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌ నగర్‌ లోని ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ లో పలువురు అధికారులతో పాటే నివాసం ఉంటున్నారు. 

ఆ ప్రాంతంలో గుట్టలు, చెట్లు, చిన్న చిన్న నీటి కుంటలు అధికంగా ఉండటంతో తరచూ విష సర్పాలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఎస్కే జోషి నివాసం వెనుకకి ఓ పాము వచ్చి చేరింది. పడగ విప్పి బుసకొడుతున్న దాన్ని చూసిన క్వార్టర్స్ లోని వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈలోగా విషయం తెలుసుకున్న రాజీవ్‌ త్రివేది అక్కడకు వచ్చారు. తన వద్ద ఉన్న ఓ పరికరంతో పామును బంధించి, ప్లాస్టిక్‌ డబ్బాలోకి పంపించారు. దానికి ఎటువంటి హానీ తలపెట్టకుండా, దూరంగా వదిలి పెట్టిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా మామూలు మనుషులే పాముని చూసి బెంబేలు ఎత్తిపోతారు, అలాంటిది ఒక పై స్థాయి అధికారి అయిన ఆయన జాగ్రత్తగా దానిని తీసుకువెళ్ళి బయా వదిలిపెట్టడం అంటే మామూలు విషయం కాదు.