ఆడవాళ్లపై అమానుషాలు ఇంకెన్నాళ్లు..

 

ఆడవాళ్లపై ఆకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటి వరకూ ఎన్నో ఘటనల గురించి వినుంటాం.. చూసుంటాం.. ఇప్పుడు ఒకేరోజు రెండు దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి.

 

 

రాజస్థాన్ లో ఓ వివాహితపై అత్యంత దారుణంగా ఆమె భర్త.. అతనితో పాటు అతని సోదరులు కూడా అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని రేణి గ్రామానికి చెందిన జగన్నాథ్ తో బాధిత మహిళకు వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొంత కాలం నుండి అదనపు కట్నం కోసం జగన్నాథ్ వేధిస్తున్నాడు. అతనితో పాటు అతని సోదరులు కూడా ఆమెను హింసించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారు ఆమెపై అత్యాచారం చేసి.. అనంతరం.. ఆమె ఒంటిపై అసభ్య పదాలతో కూడిన పచ్చబొట్లు కూడా పొడిపించారు. దీంతో ఈవిషయం వెలుగుచూడటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ దిగ్భాంతి వ్యక్తం చేసి.. కేసు విచారణను వెంటనే జరపాల్సిందే అని అదేశించారు.

 

 

తమిళనాడులో కూడా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ఫొటోను మార్ఫింగ్ చేసినందుకుగాను మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన విష్ణుప్రియ డిగ్రీ చదువుకుంటోంది. అయితే ఆమె ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీనిపై విష్ణుప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనంతరం మరో ఫొటోను మార్పింగ్ చేసి పెట్టగా బాధితురాలి తల్లిదండ్రులు మరోసారి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి వచ్చేలోపే విష్ణుప్రియ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విగతజీవిగా ఉన్న తమ కూతురిని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు మృతిపై విష్ణుప్రియ తండ్రి మాట్లాడుతూ.. ఫొటో చూసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని.. నిందితుణ్ని అరెస్ట్ చేసేంతవరకూ మృతదేహాన్ని తీసేది లేదని డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. జరుగుతూనే ఉంటాయి. మరి ఈ ఆగడాలకు అంతం ఎప్పుడో..