వైఎస్ నా బెస్ట్ ఫ్రెండ్...నాకెందుకు కడుపుమంట !

 

రాజశేఖర్‌రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆయనతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పష్టం చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విగ్రహాల తొలగింపుపై జరిగిన చర్చలో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట అని విజయవాడలో ఎవరికీ అడ్డం లేని చోట రాజవేఖర్‌రెడ్డి విగ్రహం ఉందన్నారు.
 
రోజూ ఆ రోడ్డు వెంట వెళ్లే చంద్రబాబు ఆ విగ్రహాన్ని చూసి ఓర్వలేక దానిని తొలగించారని, అంతటి మహానుభావుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. ఈ విషయం మీద జోక్యం చేసుకున్న చంద్రబాబు మాట్లాడుతూ ‘‘రాజశేఖర్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్. 1975 నుంచి 1983 వరకు కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే రూమ్‌లో ఉండే వాళ్ళం. జగన్‌కు మా స్నేహం తెలియక పోవచ్చు. వైఎస్సార్‌తో రాజకీయ విభేదం తప్ప... వ్యక్తిగత వైరం లేదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

స్నేహితుడి విగ్రహాలు చూస్తే ఎవరికైనా కడుపు మండుతుందా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నేపధ్యాలు మారినా తమ మధ్య స్నేహం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. తాను తర్వాత కాంగ్రెస్ వీడి తెలుగు దేశంలో చేరానని కానీ  ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారని గుర్తు చేసారు. దీంతో సభలో అందరూ కాస్త సైలెంట్ అవ్వగా, చంద్రబాబు ఈ విషయం చెబుతున్నప్పుడు జగన్ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఏదేమైనా చంద్రబాబు ఇప్పుడు ఎన్ని చెబుతున్నా అప్పట్లో అసెంబ్లీలోనే వారు తిట్టుకున్నతిట్లు ఇంకెవరూ తిట్టుకుని ఉండరేమో ?