మా ప్రెసిడెంట్‌గా నరేష్ ప్రమాణస్వీకారం.. రాజశేఖర్ అసహనం

 

ఈమధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో శివాజీ రాజాపై నరేష్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా మా ప్రెసిడెంట్‌గా నరేష్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ‘నేను అసోసియేషన్‌ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను’ అని నరేష్ అన్నారు. దీంతో నరేష్ మాట్లాడిన తీరుపై నటుడు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేష్ మాట్లాడిన మాటల్లో ఎక్కడా ‘మేము’ అనే పదం వాడకుండా ‘నేను’ అనే పదం వాడారని రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నరేష్ అన్నీ మాట్లాడేశారు’ అని చెబుతూ రాజశేఖర్‌ మైక్‌ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ తన సతీమణి జీవిత చేతిలో నుంచి మైక్‌ అందుకుని.. ‘నేను మాట్లాడటానికి చాలా ఉంది. మీకు ఓపిక ఉంటే వినొచ్చు. నరేష్ ‘నేను నేను’ అన్న మాట వాడి ఉండకూడదు. ‘మేము’ అని మాట్లాడాలి. నేను ఈ కార్యక్రమానికి  రావాలనుకోలేదు. నరేష్ వచ్చి పిలిచారు.. ఆయన నాకు మంచి మిత్రుడు కాబట్టి వచ్చాను. అందరం కలిసే ఈ అసోసియేషన్‌ ఎన్నికల కోసం పనిచేశాం. కాబట్టి మున్ముందు నరేష్ మాట్లాడేటప్పుడు ‘నేను’ అని కాకుండా ‘మేము’ అని మాట్లాడితే బాగుంటుంది’ అని రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నరేష్ పక్కనుంచి.. ‘నేనేదో సరదాగా అన్నాను. మనమందరం కలిసే చేశాం’ అంటూ ఆయన్ను సముదాయించేందుకు ప్రయత్నించారు.