చంద్రబాబుకు రజనీకాంత్ పరామర్శ.. వైసీపీ తీరుపై జాతీయ నేతల ఆగ్రహం
Published on: Sun Nov 21, 2021 9:04AM
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా దూషించడంపై రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.
చంద్రబాబు భార్యను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు కుటుంబానికి అండగా నిలుస్తున్న పలువురు జాతీయ నేతలు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడాను’ అని మైత్రేయన్ ట్వీట్ చేశారు.


