TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉండవల్లికి అంత డబ్బెక్కడిది?

Published on: Tue Jan 3, 2012 2:28PM

హైదరాబాద్: రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ శైలి ఆసక్తికరంగా ఉంటుంది. కార్మిక నాయకుడిగా ప్రజా జీవితాన్ని ఆరంభించి తన అనువాద వాక్ పఠిమతో రాజీవ్ గాంధీ, వై.ఎస్.రాజశేఖర రెడ్డి వంటి నాయకులను ఆకట్టుకున్న ఆయన తానో పేద పొలిటీషియన్ నని చెప్పుకుంటారు. లోక్ సభ స్పీకర్ కు ఇచ్చిన వివరాల్లో కూడా ఆయన కేవలం కొద్ది లక్షల ఆస్తులు మాత్రమే చూపారు. ఇదంతా బాగానే ఉన్నా ఇటీవల ఆయన విజయవాడలోని ప్రముఖ హోటల్ ను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బందరు రోడ్డును ఆనుకుని ఉన్న ఈ హోటల్ ఇటీవల చేతులు మారింది. దీనిని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు కలిసి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో  వంగవీటి మోహనరంగా అనుచరుడిగా ఉంటూ లిక్కర్ వ్యాపారం చేస్తూ, వైఎస్ చలువతో ఉడా ఛైర్మన్ గా చేసి అపారంగా ఆర్జించిన మల్లాది విష్ణుకు హోటల్ కొనుగోలు చేసే శక్తి ఉంది. ఎటొచ్చీ రాజకీయాల్లో ఉంటూ కూడా డబ్బు ఆర్జించలేక పోయాడన్న పేరు తెచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ హోటల్ లో భాగస్వామ్యం పొందారన్న సమాచారం ఆసక్తిని కలిగిస్తోంది. వై.ఎస్.కు వీరవిధేయుడిగా పేరు తెచ్చుకున్న  ఉండవల్లి వై.ఎస్.మరణానంతరం జగన్ ను బహిరంగంగానే వ్యతిరేకించి అధిష్టానం మెప్పును, ప్రభుత్వ పెద్దలనుంచి లబ్ధిని పొందారన్న ప్రచారం జరిగింది. అనంతరం ఆయన విజయవాడ హోటల్ లో వాటా తీసుకున్నట్లు నగరంలోని వ్యాపారవర్గాల్లో   ప్రచారం  జరుగుతోంది. రాజమండ్రిలో కూడా విశాలమైన ప్రదేశంలో ఉండవల్లి తరపున కొందరు ఐదు అంతస్తుల పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఉండవల్లి తాను ప్రకటించిన ఆస్తుల విలువలను పెంచాల్సి వస్తుందేమో?