కిరణ్ పై రాజయ్యకు ఎందుకు అంత కోపం?

 

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో చూడగానే ఆవేశంగా వూగిపోయిన తీరుపై రాజకీయవర్గాలలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. అసలేం జరిగిందంటే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ ఆయనకి ఆస్పత్రి గోడ మీద మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటో కనిపించింది. దానిని గోడ మీద నుంచి లాగి పరపరా చింపేశారు. అసలు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఫోటోని తానే చించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే అసలు విషయం వుందట..!


గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజయ్య వున్నప్పుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా, జగన్ వర్గంలో వుండేవారు. ఆతరువాత జరిగిన పరిణామాల వల్ల ఆయన టీఆర్ఎస్ పార్టీ చేరారు. ఆ కాలంలో ముఖ్యమంత్రిగా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై కొంత ఇబ్బంది పెట్టారని అంటున్నారు.  ఇప్పుడు రాజయ్య అధికారంలో వున్నారు కాబట్టి కిరణ్ పైన బదులు తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయనకి నిన్న తెలంగాణ ఆస్పత్రి గోడ మీద కిరణ్  ఫొటో చూసేసరికి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోని గోడ మీద నుంచి లాగి పరపరా చింపేశారు. అప్పటిగానీ ఆయన ఆవేశం తగ్గలేదు.