TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజమండ్రి హిట్ అండ్ రన్.. డాక్టర్ ప్రియాంక మృతి..!

Published on: Fri Aug 7, 2026 6:37PM

 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పోరాటం తర్వాత విషాదాంతం..!
 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘోర కారు ప్రమాద ఘటన తీవ్ర విషాదాంతంగా మారింది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన యువ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక చివరకు తుదిశ్వాస విడిచారు. ఈ దారుణ ఘటన స్థానికంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహజ్వాలలను రగిలిస్తోంది. ఆశలు, ఆశయాలతో సమాజానికి సేవ చేయాల్సిన ఒక వైద్యురాలి ప్రాణం నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా గాలిలో కలిసిపోవడం తీవ్ర వేదనకు గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే, ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ సమీప ప్రాంతంలో డాక్టర్ ప్రియాంక వెళ్తుండగా మద్యం మత్తులో యువకులు కారుతో అతివేగంగా వచ్చిన ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తీవ్రతకు ప్రియాంకకు శరీరంతో పాటు తలకు బలమైన తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే రక్తమడుగులో పడిపోయిన ఆమెను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసియులో చేర్పించారు.

హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చిన నాటి నుంచి డాక్టర్ ప్రియాంకను కాపాడేందుకు నిపుణులైన వైద్యుల బృందం శక్తివంచన లేకుండా శ్రమించింది. ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర వైద్యం అందించినప్పటికీ, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె ఆగస్టు 7న మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రియాంక మరణవార్త వినగానే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరోవైపు ఈ ఘోర ప్రమాదానికి కారణమైన వారిపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. రాజమండ్రికి చెందిన సూరవరపు దస్వంత్‌, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్‌లను నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విస్తృత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం బలైపోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషాద ఘటన రాజమండ్రి నగరంతో పాటు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. డాక్టర్ ప్రియాంకకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన నిందితులను చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నిందితులకు తగిన శాస్తి జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. రహదారులపై పెరుగుతున్న అతివేగం, అజాగ్రత్త డ్రంక్ అండ్ డ్రైవ్, సంస్కృతికి   అడ్డుకట్ట వేయాలని, ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక ప్రతిభావంతురాలైన వైద్యురాలు ఇలా అకాల మరణం చెందడం తీరని లోటని అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు.

Rajahmundry Car Accident, Doctor Priyanka Death, Hyderabad Hospital Treatment, Prasaditya Mall Incident, Rajahmundry News, Doctor Priyanka Accident Case