TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయే ప్రణాళిక.. భగ్నం..రాజ్ కసిరెడ్డి అరెస్ట్

Published on: Mon Apr 21, 2025 10:25PM

ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో సోమవారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు అందుకుని కూడా సిట్ విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం (ఏప్రిల్ 21) అరెస్టు చేశారు. ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో   అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయేందుకు పక్కా ప్రణాళికతో ఆయన గోవా నుంచి మారు పేరుతో హైదరాబాద్ కు వచ్చారు.

ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో అన్నీ తానై వ్యవహరించినట్లుగా రాజ్ కసిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మారుపేరుతో గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.  ఆయన గోవానుంచి రాజేష్ రెడ్డి అనే మారుపేరుతో వచ్చినట్లు తెలుస్తోంది.  

ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. అయితే అక్కడ విచారణ జరిగిందా? లేదా అన్న సంగతి తెలియదు కానీ, ఇన్నాళ్లూ గోవాలో తలదాచుకున్న రాజ్ కసిరెడ్డి ఇంకా అక్కడే ఉంటే అరెస్టు తప్పదన్న బయంతో మారుపేరుతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి నకిలీ ఐడీతో విదేశాలకు చేక్కేయాలన్నది రాజ్ కసిరెడ్డి ప్లాన్ అని సిట్ పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తనను అదుపులోనికి తీసుకున్న సందర్భంగా తాను మంగళవారం (ఏప్రిల్ 22) సిట్ విచారణకు హాజరౌతాననీ, అసలు అందుకోసమే తాను హైదరాబద్ కు వచ్చానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాను ఒక ఆడియో ద్వార తెలియజేసిన సంగతిని కూడా ఆయన సిట్ పోలీసులకు తెలిపారు. అయితే సిట్ అధికారులు మాత్రం మీ మీద నమ్మకం లేదనీ, మీరు విచారణకు హాజరౌతారని తాము విశ్వసించడం లేదనీ విస్పష్టంగా చెప్పి అదుపులోనికి తీసుకున్నారు.  

రాజ్ కసిరెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 22) విజయవాడ కోర్ట్లో హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తరువాత కోర్టు అనుమతితో ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారించే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పుడే రాజ్ కసిరెడ్డి వచ్చి ఉంటే ఆయన అరెస్టు అయ్యే వారు కాదనీ, విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లినందుకే సిట్ ఆయనను అరెస్టు చేసిందని న్యాయనిపుణులు అంటున్నారు.