28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు
Published on: Thu Jun 23, 2022 5:52AM
రైతుబంధు పంట సాయం కింద నిధుల విడుదలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వానా కాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగే రైతు బంధు సాయం కింద నిధులను ప్రభుత్వం జమ చేయనుందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం నుంచి ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు వివరించారు.
మరోవైపు వ్యవసాయ సమస్యలపై రైతులు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించిన ఏ వివరాల కోసమైనా కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవచ్చని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.


