చల్లటి కబురు: ఇక వర్షాలే వర్షాలు!

 

వర్షాకాలం వచ్చి చాలా రోజులైనా వర్షాలు కురవడం లేదని ఫీలవుతున్నారా? ఇక డోన్ట్ వర్రీ బీ హ్యాపీ.. రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురవబోతున్నాయి. త్వరలో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ‘‘ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా.. ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన?.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా’’ అని ఎంచక్కా పాడుకోవచ్చు. ఇదేదో మాటవరసకో, పాట వరసకో చెబుతున్న విషయం కాదు.. నిజంగానే రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయట. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతోంది. వాతావరణ కేంద్రం వర్షం కురుస్తుందని చెప్పింది కాబట్టి కచ్చితంగా వర్షం కురవదనే అనుమానాలేవీ పెట్టుకోకండి. ఎందుకంటే వర్షాలు ఖాయంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. వారు చెబుతున్న తీరు చూస్తుంటే నిజంగానే వర్షాలు కురుస్తాయన్న నమ్మకం కలుగుతోంది. ఎందుకంటే తమిళనాడు నుంచి విదర్భ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా వుందంట. క్రికెట్‌లో ధోనీ క్రీజ్‌లో స్థిరంగా వుంటే ఎలా పరుగుల వర్షం కురుస్తోందో, ఈ అల్ప పీడన ద్రోణి కూడా స్థిరంగా వుంటే వర్షాలు కూడా అలాగే కురుస్తాయి. అలాగే బంగాళా ఖాతం మీద ఉపరితల ఆవర్తనం భారీ స్థాయిలో వుందంట. అంటే అర్థం ఏంటంటే, ఇక వర్షాలను ఆపడం సాక్షాత్తూ ఆ వరుణ దేవుడి వల్ల కూడా కాదు. అంచేత మనమందరం ‘‘వానా వానా వందనం’’ అని పాట పాడుకోవడానికి రెడీగా వుందాం!