పాపం.. రైల్వే వాట్సాప్ నెంబర్ కూ అవే మెసేజ్ లా..!!

వాట్సాప్ అంటే కొందరికి గుడ్ మార్నింగ్‌లు, గుడీవినింగ్‌లు లేదా ఈ మెసేజ్‌ను మరో 15 మందికి ఫార్వార్డ్ చేస్తే మంచి జరుగుతుందని చెబుతూ ఫార్వార్డ్ మెసేజ్ లు.. ఇవి తప్ప పనికొచ్చేవి ఒక్కటి ఉండవు.. పాపం ప్రస్తుతం పశ్చిమ రైల్వే వాట్సాప్ నెంబర్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.

 

 

ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వీలుగా.. పశ్చిమ, మధ్య రైల్వే వాట్సాప్ నెంబర్ల ఏర్పాటు చేసారు.. జూలై 31న వీటిని ప్రారంభించారు.. అయితే, ఫిర్యాదులకు బదులుగా గుడ్ మార్నింగ్‌లు, గుడీవినింగ్‌లు చెప్పేవారు ఎక్కువైపోయారని రైల్వే అధికారులు తెలిపారు.. దేవుళ్ల ఫొటోలు, సమాచారాన్ని ఫార్వార్డ్ చేస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారని.. కొందరైతే పద్యాలు, కవితలను కూడా ఫార్వార్డ్ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.. ఇక స్నేహితుల దినోత్సవం నాడైతే ‘హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే’ మెసేజ్‌లతో నింపేసినట్టు తెలిపారు.. సదుద్దేశంతో అందుబాటులోకి తెచ్చిన ఈ నంబర్లను దుర్వినియోగం చేయవద్దని, సమస్యల ఫిర్యాదుకు మాత్రమే ఉపయోగించుకుని, మరింత నాణ్యమైన సేవలు అందుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.