పార్సిల్ చేరటానికి మూడున్నరేళ్లు పట్టింది..!!

రైలు బండి రైలు బండి వేలకంటూ రాదులేండి అనే పాట వినే ఉంటారు.. ఆ పాటని రైల్వేశాఖ ఎప్పటికప్పుడు నిజం చేస్తూనే ఉంటుంది.. రైలు నిముషాలు, గంటలు ఆలస్యంగా రావడం సహజమే.. ఈ ఆలస్యానికి మన వాళ్ళు అలవాటు పడిపోయారు.. అందుకే రైలు లేటుగా వచ్చినా మనకు పెద్దగా ఆశ్చర్యం ఉండదు.. ఆ ఆలస్యం మితిమీరితేనే అసలు సమస్య.. రైల్వే నిర్లక్ష్యం కారణంగా జరిగిన తప్పిదం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది..  పార్సిల్ రోజులు, వారాలు లేటుగా రావడం సహజం.. కానీ  రైల్వే నిర్లక్ష్యం కారణంగా ఒక పార్సిల్ చేరడానికి మూడున్నరేళ్లు సమయం పట్టింది.. ఏంటి నమ్మరా.. నిజమండి బాబూ ఒకసారి ఈ మేటర్ చూడండి.

 


2014లో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అనే కంపెనీ విశాఖపట్నం పోర్టు నుంచి రామచంద్ర గుప్తా అనే ఒక షాప్ యజమానికి 107462 వేగన్ లో ఎరువులను పార్సిల్ చేసింది.. నెలలు గడుస్తున్నా ఎరువుల పార్సిల్ రాకపోవటంతో సదరు యజమాని రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాశాడు.. తనకు రావాల్సిన వేగన్ లో రూ.10లక్షల విలువ చేసే ఎరువులు ఉన్నాయని ఆయన పేర్కొన్నా.. సదరు రైలు వేగన్ ను గుర్తించటంలో అధికారులు విఫలమయ్యారు.. ఆ వేగన్ దేశ వ్యాప్తంగా తిరుగుతూ చివరకు పెట్టెలోని ఎరువులన్ని చెడిపోయి సుమారు మూడున్నరేళ్లు తర్వాత యజమాని వద్దకు చేరింది.. ఈ ఎరువుల్ని యజమాని తీసుకోవటానికి ఒప్పుకోలేదు.. ఆయనకు జరిగిన నష్టాన్ని లెక్కకట్టి రైల్వేశాఖ నుంచి చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.