యాదాద్రి స్టేషన్ గా రాయిగిరి స్టేషన్ పేరు మార్పు

ఉత్తర్వులు జారీ చేసిన దక్షిణమధ్య రైల్వే

 

తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద దివ్వక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. విశాలమైన బస్ట్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. దేశంలోని ఎక్కడి నుంచైనా భక్తులు వచ్చేలా ప్రయాణ మార్గాలను ఆధునీకరిస్తున్నారు. యాదాద్రికి అతిసమీపంలో ఉన్న రాయిగిరి స్టేషన్ ను యాదాద్రి స్టేషన్ గా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్లో ఇప్పటికే మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు స్టేషన్ పేరు మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి రాయిగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్ గా పిలుస్తారు. ఈ స్టేషన్ ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు చాలావరకు ఈ స్టేషన్ మీదుగా వెళ్తాయి. అయితే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. ఘట్ కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ ను రాయిగిరి వరకు పొడిగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాయిగిరి నుంచి యాదాద్రి గుట్టపైకి ప్రత్యేక బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

తెలంగాణకే తలమానికంలా యాదాద్రిని వందల కోట్ల రూపాయలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని నెలల్లో యాదాద్రి భక్తులతో అత్యంత రద్దీగా మారే అవకాశం ఉంది.