TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ మరో సెల్ఫ్ గోల్ !

Published on: Wed Mar 12, 2025 9:11AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఇటీవల గుజరాత్ లో పర్యటించారు.రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ పునర్జీవనం లక్ష్యంగా నాయకులు, అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 2027 ఎన్నికలలో గెలుపు కోసం ఇప్పటి నుంచే పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. అయితే  ఆ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకుల గురించి చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో మరింతగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే  ఆ సంచలన ప్రకటన ఉద్దేశం  అది కాదు,వేరే వుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

దేశ రాజకీయాల్లో గుజరాత్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత గురించి వేరే చెప్ప నక్కర లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం గుజరాత్. అంతే  కాదు, గుజరాత్ మోడల్ ను గొప్పగా చూపించే  2014లో  బీజేపీ కేంద్రంలో తొలిసారి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి  వచ్చింది. అలాగే  30 ఏళ్లుగా గుజరాత్  అధికార పీఠం పై తిష్ట వేసుకు కూర్చుంది. మరో వంక  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన ప్రవర్థమానంగా దిగజరుతోంది.  2022 ఎన్నికల్లో కేవలం 17 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అందులో ఐదుగురు  చేయి వదిలి పువ్వు పార్టీలో చేరారు. 

అయితే కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనే నిర్ణయానికి వచ్చారో ఏమో తెలియదు కానీ, రాహుల్ గాంధీ 2027 ఎన్నికల్లో ఎలాగైనా,అధికారాన్ని చేజిక్కించుకోవాలనే సంకల్పంతో  రెండేళ్ళు ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రయాణం మొదలు పెట్టారు. అహ్మదాబాద్  లో  ఏర్పటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని  ప్రసంగించారు. అయితే  రాహుల్ వ్యూహం ఏమిటో, ఎందుకు అలా మాట్లాడారో ఏమో కానీ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడం పక్కన పెట్టి, కార్యకర్తలు నాయకులపైనే విరుచుకు పడ్డారు. కార్యకర్తలు, నాయకుల విశ్వసనీయతను ప్రశ్నించారు. సమావేశానికి హాజరైన వారిలో సగం మంది బీజేపీ కోవర్టులే  అంటూ నింద మోపారు. బీజేపీ ‘బీ’ టీమ్’ గా ముద్ర వేశారు. అంతే కాదు, అలాంటి నమ్మక ద్రోహులను పార్టీ నుంచి ఏరి వేస్తామని హెచ్చరించారు.

అయితే, రాహుల్ గాంధీ  గుజరాత్  కాంగ్రెస్ క్యాడర్ ను ఉద్దేశించే’ ఈ సంచలన వ్యాఖ్యలు  చేశారో లేక మొత్తంగా దేశంలో ఇదే పరిస్థితి ఉందనేది ఆయన ఉద్దేశమో తెలియదు కానీ  ఆయన ప్రకటన దేశ వ్యాప్తంగా  ప్రకంపనలు సృష్టించింది. అంతే కాదు గుమ్మడి కాయల దొంగంటే బుజాలు తడుముకున్నట్లు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా  ముఖ్యమైన పదవుల్లో ఉన్న నాయకులు బుజాలు తడుముకుంటున్నారు. మరో వంక కాంగ్రెస్ సీనియర్ నాయకులు  కొందరు మాత్రం  రాహుల్ గాంధీ చేసిన హెచ్చరిక ఉద్దేశం ఏదైనా, పార్టీ పరిస్థితిని దేశ వ్యాప్తంగా మరింత దిగజార్చి వేస్తుందని అంటున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా  రాహుల్ ప్రకటనతో తెలంగాణలో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్వసనీయతపైనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నిజానికి  రేవంత్ రెడ్డికి పూర్వశ్రయంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో అనుబంధం ఉన్న మాట నిజం. అందులో దాపరికం లేదు. నిజానికి  ఆ నిజాన్ని ఆయనే స్వయంగా అనేక సందర్భాలో చెప్పుకున్నారు. అయినా అదంతా గతం, ఆ తర్వాత ఆయన చాలా దూరం ప్రయాణించారు. చాల చాల మజిలీలు మారారు. ఆర్ఎస్ఎస్ గణవేష మొదలు గాంధీ టోపీ వరకు చాలా వేషాలు వేశారు. పార్టీలు మారారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా, ఆయన మూలాలు తెలిసే, రాహుల గాంధీ ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. పార్టీలో పుట్టి పెరిగిన వారిని కాదని ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. 

అయినా  ఇప్పడు రాహుల్ ప్రకటనతో ఆయన పైనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. శీల పరీక్షకు నిలవ వలసి వస్తోంది. ఇటీవల కాలంలో ఆయన ఒకటి రెండు సందర్భాలలో బీజేపీ నాయకులతో వేదిక పంచుకున్నారు. తప్పుకాదు. కానీ, ఆ సమయంలో, పాత బంధాలను  గుర్తు చేసుకుని మురిసి పోయారని ప్రత్యర్ధులు ఎత్తి చూపుతున్నారు. అలాగే  కొంచెం ఎక్కువగా రాసుకు పూసుకు తిరిగినట్లు ఆరోపిస్తున్నారు. మరో వంక  అటు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా  ఉంటున్నారనే  నిందను రేవంత్ మోస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్ అభ్యర్ది ఓడి పోతున్నారనే సంకేతాలు ఇచ్చారనే ఆరోపణ ఢిల్లీ చేరింది. ఈ నేపధ్యంలోనే  ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు, రాహుల్ గాంధీ గుజరాత్ లో చేసిన గర్జన ప్రభావం రేవంత్ రెడ్డి మీద పడుతుందా అంటే  మీనాక్షి నటరాజన్  నియామకం తదనంతర పరిణామాలతో  కలిపి చూస్తే, ప్రస్తుతానికి  ఫిఫ్టీ .. ఫిప్టీ అంటున్నారు.  

అదలా ఉంటే  అసలు రాహుల్ గాంధీ అలాంటి  ప్రకటన చేయడం వెనక, తనను తాను రక్షించుకునే వ్యూహం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ఢిల్లీ డబుల్ జీరో హట్రిక్  తర్వాత కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ పార్టీ నాయకత్వం పై అసంతృప్తిని వ్యక్త పరిచారు. మరో వంక కర్ణాటక ఉప ముఖ్యమత్రి  డీకే శివకుమార్  పార్టీ లైన్కు విరుద్ధంగా కుంభమేళ, సద్గురు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా సంఘ్ పరివార్/ బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇచ్చారు.  దీంతో పొంచి ఉన్న ముప్పును గ్రహించి రాహుల్ గాంధీ   ఎదురుదాడికి సిద్డమయ్యారనీ, అందులో భాగంగానే, ఆయన  ... బీజేపీ కోవర్టులు, బీజేపీ ‘బీ’ టీమ్ అంటూ సొంత సైన్యం పైనే కత్తులు దూశారని  , ఒక విధంగా ఇది రాహుల్ గాంధీ స్కోర్ చేసిన మరో సెల్ఫ్ గోల్   అవుతుందని రాజకీయ పండితులు  విశ్లేషిస్తున్నారు.