TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ.. 'మేడ్ ఇన్ చైనా'పై సెటైర్లు..

Published on: Wed Feb 9, 2022 3:55PM

స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ. ముచ్చింత‌ల్‌లో వెల‌సిన స‌మ‌తామూర్తి. 216 అడుగులు ఎత్తైన‌ శ్రీరామానుజుల విగ్ర‌హం. యావ‌త్ దేశానికే స‌మ‌తాస్పూర్తిని చాటే ద‌ర్శ‌నం. ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా త‌దిత‌రులు త‌ర‌లివ‌చ్చారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ సైతం రానున్నారు. ఇలా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ.. రామానుజుల పంచ‌లోహ విగ్ర‌హం చైనాలో త‌యారు చేయ‌డంపై కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్‌గాంధీ ట్విట్ట‌ర్‌లో సెటైర్లు వేశారు. 

రామానుజుల‌ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు రాహుల్‌. ‘‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీని చైనాలో తయారుచేశారు. ‘నవ భారత్‌’ అంటే చైనా-నిర్భరేనా?’’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శించారు.   

హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన‌ 216 అడుగుల సమతామూర్తి విగ్ర‌హాన్ని పీఎం మోదీ జాతికి అంకితం చేశారు. ఈ భారీ పంచ‌లోహ‌ విగ్రహాన్ని చైనాలోని ఏరోసన్‌ కార్పొరేషన్‌ సంస్థ తయారుచేసింది. ఇందుకోసం 2015లోనే ఆ కంపెనీ కాంట్రాక్ట్‌ తీసుకుంది. విగ్రహం ప్రధాన వర్క్‌ అంతా చైనాలోనే పూర్తిచేసి 1600 విడి భాగాలుగా భారత్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత 15 నెలల పాటు శ్రమించి ఆ భాగాలను లేయర్ల వారీగా అతికించారు. పంచలోహా విగ్ర‌హంలో 83 శాతం రాగితో పాటు వెండి, బంగారం, జింక్‌, టైటానియంతో తయారు చేశారు. ప్రపంచంలోనే కూర్చుని ఉన్న విగ్రహాల్లో.. రెండో అతిపెద్ద విగ్ర‌హంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నిలిచింది.