TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ‌పై రాహుల్ ఫోకస్.. 2 రోజుల టూర్‌తో జోష్!

Published on: Tue Apr 5, 2022 2:31PM

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొత్త కాదు. కాకపోతే, ఇటీవల కాలంలో అసమ్మతి ఇంకొంత కట్టుతప్పినట్లు కనిపిస్తోంది.ఇంచుమించుగా మూడేళ్ళుగా పార్టీకి దిశా నిర్దేశంచేసే పూర్తి స్థాయి అధ్యక్షుడు / అధ్యక్షురాలు లేక పోవడం ఒక కారణం అయితే, పార్టీని వెంటాడుతున్నవర్ష ఓటములు మరో ముఖ్యకారణంగా కనిపిస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో జీ 23, రాష్ట్రంలో ‘కాంగ్రెస్ విధేయుల వేదిక’  వంటి అసమ్మతి వేదికలు హల్’చల్ సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ దృష్టికోణం నుంచి ఒక మంచి పరిణామంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

ముఖ్యంగా, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పట్టాల మీదకు తెచ్చేందుకు రాహుల్ గాంధీనడుం బిగించడం పట్ల పార్టీలో సంతోషం వ్యక్తమవుతోంది. నిజానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ వుంది. పార్టీ క్రియాశీల సభ్యత్వం విషయంలో టీపీసీసీ ప్రదమ స్థానంలో వుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సమర్ధ  స్థానిక నాయకత్వం వుంది.అయిన అన్నీ ఉన్నా అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి కారణంగా వెనకబడి పోతున్న తెలంగాణపై  రాహుల్ గాంధి దృష్టి పెట్టడం శుభపరిణామంగా భావిస్తున్నారు. 

కాగా, ఇటీవల కాలంలో మదటి సారిగా రాష్ట్ర కీలక నేతలు అందరినీ ఢిల్లీకి పిలిపించి దిశానిర్దేశం చేయడమే కాకుండా గీత దాటితే వేటు తప్పదని అసమ్మతి నాయకులకు స్పసహ్తమైన హెచ్చరిక చేశారు. అధికారం కోసం అధికార పార్టీపై పోరాడాల్సింది పోయి తమలో తము పోట్లాడుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ గట్టి వార్నింగ్ ఇచ్చారు.  అంతే కాకుండా క్రమశిక్షణ గీత దాటినా, టీఆర్ఎస్ నాయకులతో  చేతులు  కలిపి పార్టీకి హాని తలపెట్టిననా సహించేది లేదని స్పష్టం చేశారు. తెరాస, ఎంఐఎం పార్టీలతో పొత్తు ఉండదని తేలిచి చెప్పారు . తెరాస ప్రభుత్వంపై పార్టీ నాయకులు అందరు ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. 

మరో వంక రాహుల్ గాంధీ, ఒకే నెలలో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 28న వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్నారు. 29న హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఢిల్లీలో పార్టీ నేతల సమావేశంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలను ఖరారు చేశారు.

అయితే, గుర్రాన్ని రేవుకు తీసుకుపోవచ్చును కానీ, నీళ్ళు తాగించలేము. ఆలాగే కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ తీసుకు పోవచ్చును, కానీ, అసమ్మతిని చల్లార్చడం, అయ్యే పని కాదని, పార్టీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా టీపీసేసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సీనియర్ నాయకులు సిద్దంగా లేరని, అలాగని పార్టీని వదిలి పోలేరని, కాబట్టి అసమ్మతి కార్యకలాపాలు కొద్ది కాలం సర్దు మనిగినట్లు కనిపించినా,  కథ మళ్ళీ మొదటికే వస్తుందని అంటున్నారు.