పదేళ్ల తర్వాత రైతులకు తిరిగి భూములు

 

ఛత్తీస్‌గఢ్‌లో టాటా స్టీల్‌ ప్రాజెక్టు కోసం 2008లో 1,707 మంది గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములకు సంబంధించిన పత్రాలను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం సాయంత్రం తిరిగి ఇచ్చేయనున్నారు. 2008 లో బీజేపీ ప్రభుత్వం టాటా స్టీల్‌ ప్లాంట్ ఒప్పందం చేసుకుని, రైతుల నుంచి భూమిని తీసుకుంది. లోహండిగూడ ప్రాంతంలో రూ.19,500 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మించాలని భావించగా కొన్ని పరిస్థితుల వల్ల ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. రైతులకు భూములూ తిరిగివ్వలేదు. కాగా, రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని గత ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల భూములను తిరిగి ఇచ్చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన రైతుల హక్కులను తెలియచెబుతూ ‘ఆదివాసీ కృషక్‌ అధికార్‌ సమ్మేళన్’ పేరుతో ధురగావ్‌‌ గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భూములకు సంబంధించిన పత్రాలతో పాటు అటవీ హక్కుల ధ్రువపత్రాలు, రైతు రుణమాఫీ పత్రాలను రాహుల్‌ గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో రూ.582 కోట్ల రుణమాఫీ పత్రాలను రైతులకు అందించనున్నారు. మొత్తం 1,40,479 మంది రైతులకు రుణాల నుంచి విముక్తి లభించనుంది.