ఏడేళ్ల బాలుడికి రాహుల్ గాంధీ ఫోన్

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీతో పాటు, కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీకి కేరళలో ఒక వింత అనుభవం ఎదురైంది. కన్నూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు.

అయితే రాహుల్‌ను విపరీతంగా అభిమానించే ఏడేళ్ల బాలుడు నందన్.. రాహుల్ ని చూడాలని తల్లిదండ్రులతో కలిసి అక్కడికి వచ్చాడు. నందన్ తన చొక్కాపై రాహుల్ గాంధీ స్టిక్కర్ సైతం అతికించుకున్నాడు. స్థానిక ఆడిటోరియం కిక్కిరిసి పోవడంతో నందన్, అతని తల్లిదండ్రులు అందులోకి ప్రవేశించలేకపోయారు. దీంతో వారు మీటింగ్ అయిపోయేవరకు బయటే ఉండాల్సి వచ్చింది. దాదాపు 5 గంటలు వేచి ఉన్నారు. మీటింగ్ అనంతరం రాహుల్ అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయారు. సెక్యూరిటీ కారణాలతో రాహుల్ సభాస్థలి నుంచి నేరుగా వాయనాడ్ వెళ్లిపోయారు.

తన అభిమాన నేతను చూసే వీలుదక్కకపోవడంతో నందన్ భోరుమన్నాడు. అయితే జరిగిన సంఘటనను నందన్ తండ్రి ఫేస్‌బుక్‌లో ఫోటోలతో సహా షేర్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ కావడంతో రాహుల్ గాంధీ వరకూ చేరింది. వెంటనే రాహుల్ పార్టీ నేతలను ఆదేశించి నందన్‌తో మాట్లాడించే ఏర్పాటు చేయాలని ఆదేశించాడు. వారు నందన్ తండ్రిని సంప్రదించి, అతని ఫోన్ నెంబర్ ను రాహుల్ సిబ్బందికి అందచేశారు. అనంతరం రాహుల్ నేరుగా నందన్ కుటుంబానికి ఫోన్ చేసి.. బాలుడితో మాట్లాడాడు. తన అభిమాన నేత ఫోన్ చేసి పలకరించడంతో నందన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.