రాహుల్‌గాంధీ నామినేషన్‌ వివాదానికి తెర

 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నామినేషన్‌ వివాదానికి తెర పడింది. ఆయన నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాహుల్ గాంధీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ లోని అమేథీ స్థానంతో పాటు, కేరళలోని వాయనాడ్ స్థానం నుండి నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే నామినేషన్ల పరిశీలన సమయంలో అమేథీ నుండి పోటీ చేస్తున్న ధృవ్ లాల్ అనే స్వతంత్ర అభ్యర్ధి రాహుల్ నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. యూకే పౌరసత్వాన్ని రాహుల్ కలిగి ఉన్నారని చెప్పారు. ఇతర దేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నందున రాహుల్ నామినేషన్‌ను తిరస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్‌ ప్రత్యర్థులుగా ఉన్న స్వతంత్ర అభ్యర్థితో పాటు మరో నలుగురు అభ్యర్థులు కూడ ఇదే విషయాన్ని సమర్ధించారు.

కాగా, రాహుల్ గాంధీ తన పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను  సమర్పించారు. దీంతో రాహుల్ గాంధీ నామినేషన్‌కు రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. రాహుల్ గాంధీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను కూడ ఇచ్చినట్టుగా  రాహుల్ గాంధీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు.