TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్‌‌కు త్వరలోనే పట్టాభిషేకం..

Published on: Wed Jun 1, 2016 3:32PM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ అధ్య్షక్షుడిగా పట్టాభిషేకం చేసేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, అందులో యువరాజు పట్టాభిషేకానికి ముహుర్తం నిర్ణయిస్తారని ప్రచారం జరుగుతోంది. సోనియా మాత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి పదవికి పరిమితం అవుతారని అంటున్నారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలని చాలా కాలంగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు సీనియర్లు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. వరుస పరాజయాల నేపథ్యంలో పార్టీకి కొత్త జీవం పోయాలని అటు సోనియా గాంధీ కూడా భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌తో పాటు పార్టీ జాతీయ కార్యవర్గం మొత్తాన్ని కూడా పూర్తిగా మారుస్తారని చెబుతున్నారు. ఎక్కువగా యువతకు స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

అయితే రాహుల్ సారథ్యాన్ని కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారని, రాహుల్‌కు పగ్గాలు ఇస్తే మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని, అందుచేత సోనియా గాంధీయే నాయకత్వం వహించాలని ఆ కొంతమంది కోరుతున్నారు. సీనియర్లు ఇంతగా భయపడటానికి కారణాలు లేకపోలేదు. ఒక్క బీహార్‌లో తప్ప మరెక్కడా ఆయన ఎన్నికల ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రికార్డు లేదు. ఆయన ప్రచారం చేసిన చోట కంటే చేయనిచోట్లే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు. ఇప్పటికి తనంతట తాను సొంత నిర్ణయాలు తీసుకోలేక సోనియా గాంధీ లేక తన అంతర్గత సలహాదారుల మీదే ఆధారపడతారన్న అపవాదు ఉంది. అన్నింటికి మించి వ్యూహ, ప్రతివ్యూహల్లోనూ, వాగ్థాటిలోనూ ప్రధాని నరేంద్రమోడీ ముందు రాహుల్ ఏ మాత్రం నిలబడలేరు . ఇలాంటి పరిస్థితుల్లో సోనియా రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేస్తారా..లేక తానే మరికొంత కాలం పార్టీని నడుపుతారా అని తెలియాలంటే వేచిచూడాల్సిందే.