ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు బెటర్

 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీకేంద్రమంత్రి శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తమమని శరద్ పవార్ అన్నారు. ఎన్డీయేతర పక్షాల నుంచి ప్రధాని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి వస్తే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఏపీ సీఎం చంద్రబాబులు అర్హత గలవారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాయావతి, మమత బెనర్జీ లేదంటే చంద్రబాబు.. ఎన్‌డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురూ అర్హులే. కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడమే ఉత్తమం’’ అని అన్నారు.

ప్రస్తుతం దేశంలో ఎన్డీయేతర మహాకూటమి ఉందా ? అని ప్రశ్నించిన శరద్ పవార్.. ఎన్నికల తరువాత ఎన్డీయేలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని అన్నారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీలను ఎన్నికల తరువాత తమ కూటమిలోకి తీసుకొస్తామని పవార్ అన్నారు. 2004 ఎన్నికల తరువాత కూడా ఇదే జరిగిందని పవార్ గుర్తు చేశారు. అలా దేశానికి పదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని అన్నారు. దేశంలో మంచి నాయకులకు కొదవలేదన్న శరద్ పవార్.. ఎన్నికల తరువాత వాళ్లు ఎవరన్నది డిసైడ్ చేస్తామని అన్నారు. ఇప్పుడే ఎవరో ఒకరి పేరు చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల తరువాత బీజేపీయేతర పక్షాలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి పని చేస్తాయని పవార్ స్పష్టం చేశారు.