రాహుల్ పిలుపుతో మళ్లీ తెరపైకి సిఎం మార్పు? పాల్వాయిని పిలిచింది తెలంగాణా కోసమా?
Published on: Wed Jul 4, 2012 11:35AM
తెలంగాణా రాజ్యసభసభ్యుడు పాల్వాయిగోవర్థనరెడ్డిని బుధవారం సాయంత్రం తనను కలవాలని ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ స్వయంగా ఢల్లీ ఆహ్వానించటం రాష్ట్రంలో సంచలనమైంది. ఇప్పటి వరకూ సిఎం మార్పుపై మల్లగుల్లాలు పడుతున్న వారంతా ఇది ఖచ్చితంగా అదే అంటున్నారు. అయితే తెలంగాణాపై ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధిష్టానం చర్చోపచర్చలు జరిపి రాయలతెలంగాణా అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. అలానైతే జాన్తానై అన్న టిఆర్‌ఎస్ వాదనతో కాంగ్రెస్‌కు ఈ విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాలేదు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్, పార్టీకి విధేయుడుగా ఉన్న గోవర్థనరెడ్డిని పిలిపించారని అధికారిక సమాచారం.
కానీ, ఆ పార్టీలోనే గతంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నిక కూడా ఇలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఆల్‌రెడీ పీసిసి చీఫ్ బొత్సా సత్యన్నారాయణ ఢల్లీలోనే ఉండగా పాల్వాయిని పిలిపించటం రాష్ట్ర పరిణామాల్లో మార్పు కోసమేనని కాంగ్రెస్ నేతలు ఖరాకండిగా వాదిస్తున్నారు. దీంతో అసలు గోవర్థనరెడ్డిని ఎందుకు పిలిపించారనే విషయం అర్థం కాకుండానే పోయింది. తెలంగాణా కోసమా లేక సిఎం పదవి కోసమా అన్న విషయమై రాష్ట్రంలో రాజకీయ నాయకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. బుధవారం సాయంత్రం రాహుల్‌గాంధీని పాల్వాయి కలిసేంత వరకూ విషయం గోప్యంగానే ఉంటుందన్నది మాత్రం ఖాయం. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమే అన్న ఫార్ములా అమలు జరిగితే గోవర్థనరెడ్డి కన్నా ముందే ఢల ్లీ పెద్దల ముందు కలతిరిగిన జానారెడ్డి ఇక జీవితంలో సిఎం స్థాయిని అందుకోలేరన్న వాస్తవం మాత్రం తేలుతోంది. ఏదేమైనా రాహుల్ పిలుపు ఓ సంచలనానికి కారణమైంది.


