రాహుల్ గాంధీయే నా బాస్.. పుత్రోత్సాహమా.. ?నమ్మకమా..?


కొత్తగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ మాంచి జోష్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాతే గుజరాత్ ఎన్నికలు వచ్చాయి. ఇక ఈ ఎన్నికలే రాహుల్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని కూడా అనుకున్నారు. అయితే రాహుల్ కు కాలం బాగానే కలిసొచ్చింది. రాహుల్ బాధ్యతలు స్వీకరించిన తరువాతే 2జీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు ఊరట కలిగింది. దీంతో రాహుల్ వచ్చిన వేళా విశేషం అనుకున్నారు. ఆతరువాత గుజరాత్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. దాదాపు 15 రోజుల పాటు రాహుల్ అక్కడే మకాం వేసి ప్రచారంలో మోడీపైన సెటైర్లు వేస్తూ జనాల్లోకి బాగానే వెళ్లాడు. దాని ప్రభావం ఎన్నికల్లో కూడా కనిపించింది. మోడీ కంచుకోట అయిన గుజరాత్ లోనే మోడీ చచ్చీ చెడీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ రాహుల్ గాంధీని హీరో చేసింది. తాజాగా జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో అయితే బీజేపీ ఓడిపోయి... కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో రాహుల్ పై గతంలో ఉన్న ముద్ర పోయింది.

 

మరి గతంలో రాహుల్ అంటే పప్పు అనుకునే వాళ్లు ఇప్పుడు ఆయన్ని హీరో అంటుంటే.. సోనియా గాంధీకి ఎలా ఉంటుంది. అసలు ఎప్పుడో ఇవ్వాల్సిన పార్టీ భాధ్యతలు ఇంత లేట్ అయిందంటే దానికి గతంలో రాహుల్ పై ఉన్న అభిప్రాయమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలోనే తన కొడుకు గురించి సోనియా గాంధీ కూడా ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 19 సంవత్సరాలు సోనియా గాందీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు మోసింది. తన కనుసన్నల్లోనే పార్టీని నడిపించింది. అలాంటి సోనియా ఆ బాధ్యతలను స్వీకరించిన తన కుమారుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తనకు రాహుల్ గాంధీయే బాస్ అని ఆమె అన్నారు. "నా బాస్ కూడా రాహుల్ గాంధీయే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరంతా ఆయనతో కలసి నడుస్తారని నాకు తెలుసు. నాపై చూపించిన నమ్మకాన్ని, విశ్వాసాన్నే రాహుల్ పైనా చూపుతారని అనుకుంటున్నా" అని కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంట్ లో సమావేశమైన సోనియా వ్యాఖ్యానించారట. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని అందుకుంటుందన్న విశ్వాసం తనకుందని అన్నారట. మొత్తానికి సోనియాకు రాహుల్ పై గట్టి నమ్మకమే ఏర్పడింది. తన కొడుకును చూసుకొని పుత్రోత్సాహంతో మురిసిపోతున్నట్టు ఉంది సోనియా.. అందుకే రాహుల్ పై అంత నమ్మకం పెట్టుకున్నారు. మరి సోనియా నమ్మకాన్ని రాహుల్ ఏం చేస్తాడో చూద్దాం...