రాహుల్ కూడా మొదలెట్టాడు...

 


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... లేక ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. ఎవరి అధికారం చేపడతారు... ఈ విషయాలపై అబ్బో ఇప్పటికే ఎంతో మంది ఎన్నో సర్వేలు చేశారు. ఇక్కడే కాదు...ఓ జాతీయ ఛానెల్ కూడా ఏపీ రాజకీయాలపై ఇంట్రస్ట్ తో సర్వే చేయించింది. ఇక సర్వేల్లో  మాకు ఇన్ని సీట్లు వస్తాయి.. వాళ్లకి  ఇన్ని సీట్లు వస్తాయి అంటూ ఎవరికి వాళ్లు వారి పార్టీలకు ఫెవర్ గా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు అందరూ అయిపోయారు.. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మిగిలారు. ఆయన కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాలపై సర్వే చేయించారట.

 

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ కి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఏదో చచ్చీ చెడీ గెలిచింది ఆ ఎన్నికల్లో బీజేపీ. ఓ రకంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి గుజరాత్ ఎన్నికలు బాగానే జోష్ ఇచ్చాయి.  ఇక మొన్నీమధ్య రాజస్థాన్ లో రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే రెండు నెల‌ల్లో క‌ర్నాట‌క‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా రాహుల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్‌గా చేసుకున్న రాహుల్ జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు త‌న టీంతో స‌ర్వేలు చేయించారట. ఈ క్రమంలోనే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు రెడీ అవుతోన్న ఏపీ, తెలంగాణ‌లో సైతం జ‌నాల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు రాహుల్ స‌ర్వే చేయించారట. ఈ స‌ర్వేలో ఏపీలో అధికార టీడీపీ వైపు జ‌నాలు మ‌రోసారి మొగ్గు చూపుతున్న‌ట్టు తేలింద‌ట. మొత్తం 13 జిల్లాల్లోని 175 స్థానాల్లో టీడీపీకి ఎంత క్లిష్టంగా చూసుకున్నా క‌నిష్టంగా 95, గ‌రిష్టంగా 110కు త‌గ్గ‌వ‌ని తేలింద‌ట‌. ఇక విప‌క్ష వైసీపీ గ‌త ఎన్నిక‌ల కంటే దిగ‌జారి 55 -60 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తేలింద‌ట‌. అంతేకాదు.. గ‌త‌ ఎన్నికల్లో వైసీపీకి కర్నూలు, కడప జిల్లాలు కంచుకోటలుగా వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే త‌గులుతుంద‌ని రాహుల్ స‌ర్వేలో తేలింద‌ట‌.

 

మరి ఎవరు ఎన్ని సర్వేలు చేసినా ఆఖరికి పార్టీల భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంటుందన్నది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఎంత మంది ఎన్ని సర్వేలు చేసుకున్నా ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం గడతారో వారిదే అధికారం. పాపం ఏదో రాజకీయ నేతలు తమ సంతృప్తి కోసం ఇలా సర్వేలు చేసుకుంటూ హ్యాపీగా ఫీలవుతారు అంతే తప్పా.. సర్వేలను నమ్ముకుంటే అంతే సంగతి. మరి చూద్దాం ఆఖరికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి... ఎవరు అధికారం చేపడతారో...