రాహుల్ ను హీరో చేసిన హీరోయిన్...

 

గుజరాత్ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో బీజేపీ గెలిచింది. రేపో మాపో అధికారం కూడా చేపట్టనుంది. ఇకపోతే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ చచ్చీ చెడీ గెలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో.. ఏదో పది పదిహేను సీట్లు అటూ ఇటూగా వచ్చి.. బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. లేకపోతే అప్పుడు మ్యాటర్ వేరేలా ఉండేది. మరి ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఆనందంగా లేదు కానీ.. ఓడిపోయినా.. కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు లేండి. ఇప్పటి వరకూ ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఓడిపోడింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కానీ... గతంలో జరిగిన ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చుక్కలు చూపించింది. దేశానికే వణుకు పుట్టించే మోడీ సైతం భయపడ్డారంటేనే అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎంత పోటీ ఇచ్చిందో.

 

ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల పుణ్యమా అని.. ఇప్పటివరకూ పప్పు, దద్ది అని ట్యాగ్ లైన్లు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఒకప్పుడు రాహుల్ గాంధీ మాటతీరు, సభల్లో సమావేశాల్లో అయన ఉండే తీరు, పార్లమెంట్ సభల్లో నిద్రపోవడం.. ఇవన్నీ చూసి రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికిరాడు...ఆయన పప్పు అని ప్రతిపక్షపార్టీనేతలు కామెంట్లు చేసుకునేవారు. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ.. ఈ మధ్య రాహుల్ మాటలో తేడా వచ్చింది. రాజకీయాల్లో కాస్త చురుకుగా ఉంటున్నారు. అంతేకాదు మోడీపై మాత్రం ఘాటుగానే విమర్శలు గుప్పించారు. అందుకే రాహుల్ గాంధీ మార్పుపై వార్తలు కూడా వచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే మోడీ కూడా కాస్త భయపడ్డాడు.

 

ఇవన్నీ ఒకత్తైతే అసలు రాహుల్ గాంధీ హీరో అవ్వడానికి ఇదోక్కటే కారణం కాదని.. దీని వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు  ప్రముఖ కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య. ఈమెకు, రాహుల్ గాంధీ హీరో అవ్వడానికి సంబంధం ఏంటా అనుకుంటున్నారా..? ఏంటంటే... ఈ రోజుల్లో ఏ  విషయం అయినా క్షణాల్లో నలుగురికి చేరాలంటే సోషల్ మీడియా ఒకటి చాలు. అదే హీరోని చేస్తుంది.. అదే జీరోని కూడా చేస్తుంది. రాహుల్ గాంధీపై ఒకప్పుడు ఉన్న పప్పు బ్రాండ్ కు కూడా కారణం ఈ సోషల్ మీడియానే. అలాంటి ఇమేజ్ పోగట్టడంలోనే రమ్య సక్సెస్ అయింది. సోషల్ మీడియాలో బీజేపీ దూకుడుకి తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ డిజిటల్ ప్రచారాన్ని ఆమె కొత్త పుంతలు తొక్కించారు. డిజిటల్ ప్రచార బాధ్యతలని తీసుకున్న వెంటనే ఆమె ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు. ముందుగా రాహుల్ గురించి చెప్పే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. మోడీ అధికారం చేపట్టాక తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పధకాల వల్ల జరుగుతున్న నష్టానికి విస్తృత ప్రచారం కల్పించారు. ఇంకేముంది అప్పటి దాకా సోషల్ మీడియాలో ఆఫెన్స్ తప్ప డిఫెన్స్ తెలియకుండా రెచ్చిపోతున్న బీజేపీ తొలిసారిగా రక్షణలో పడాల్సి వచ్చింది. దాంతో రాహుల్ మీద దాడి మాట అటుంచి మోడీ అండ్ కో నిర్ణయాల మీద వివరణలకే పరిమితం అయ్యేలా చేశారు.

 

అంతేకాదు గుజరాత్ ప్రచారంలో కూడా...ఇదే ఫార్ములానే నమ్ముకుంది. దీంతో ప్రధాని మోడీ సైతం తన నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్ బాగుంటుందని చెప్పుకోవాల్సి వచ్చింది. ఆఖరికి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ బాధపడకుండా.. బీజేపీకి రాహుల్ గట్టి పోటీ ఇచ్చాడని...ఓ పది సీట్లు అటు ఇటు అయితే మోడీ కి ఎదురు దెబ్బ తగిలేదన్న విషయాన్ని దేశమంతటా విస్తృతంగా ప్రచారం చేయగలిగారు. నిజం చెప్పాలంటే ఈ విషయంలో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. నిజంగానే రాహుల్ ను హీరోని చేశారు. మోడీకి చెమటలు పట్టించాడని... చుక్కలు చూపించాడని అందరూ పొగడ్తలు కురిపించారు. మొత్తానికి తెర వెనుక ఉండి నడిపించిన రమ్య.. రాహుల్ జాతకాన్ని మార్చేసింది అని చెప్పుకోవచ్చు.