రాహుల్ గాంధీ జగన్ని మేల్కొలిపినట్లే ఉంది!

 

ఇంతవరకు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు వంటి కేంద్రంతో సంబంధం ఉన్న అంశాలపై పెద్దగా స్పందించని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ చేసిన విమర్శలతో జ్ఞానోదయం పొందారో లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని అనుకొంటున్నారో ఏమో తెలియదు కానీ ఇకపై ప్రత్యేక హోదా కోసం మరింత ఉదృతంగా పోరాటం చేస్తానని ప్రకటించారు. అవసరమయితే డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేసయినా సరే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేకహోదా సాధిస్తామని ఆయన చెప్పడం విశేషం. ఎన్నికలకు మునుపు ఆయన చాలా సార్లు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావలసిన అన్నిటినీ రాబడతానని జగన్ ధాటిగా చెప్పేవారు.

 

కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, కనుక వాటిలో దేనికి అధికారం చేప్పట్టే అవకాశం ఉంటే ఆ పార్టీ మద్దతు కోసం తప్పనిసరిగా తన కాళ్ళ ముందు సాగిలపదతాయని బహుశః జగన్ అంచనా వేసినందునే అంత ధాటిగా అని ఉండవచ్చును. కానీ ఎన్నికలలో తన పార్టీ ఓడిపోవడం, అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఇక తన పార్టీ మద్దతే అవసరం లేకుండా పోయింది. దానితో జగన్ ఈ “మెడలు వంచుడు” మాటలని పూర్తిగా ఉపసంహరించుకొని, మోడీ ప్రభుత్వాన్ని మంచి చేసుకొనే పనిలో పడ్డారు. బహుశః అందుకే ఆయన ఇంతకాలం మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాటనలేదు.

 

కానీ రాహుల్ గాంధీ వేసిన చురకలతో మళ్ళీ ఆయనలో వేడి పుట్టి ఉండవచ్చును. అందుకే కేంద్రం పట్ల తను అనుసరిస్తున్న మెతక వైఖరిని పునరాలోచించుకొని, మళ్ళీ మెడలు వంచుడు కార్యక్రమాన్ని మొదలుపెడతానని అంటున్నట్లున్నారు. కానీ ఆయన కేంద్రం మెడలు వంచుతారో లేక కేంద్రమే ఆయన మెడలు వంచుతుందో ఎవరయినా చాలా తేలికగానే ఊహించవచ్చును. ఇదంతా బాగానే ఉంది కానీ రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ పార్టీని ఉత్సాహపరచాలని వస్తే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మేల్కొన్నారేమిటో విడ్డూరం కాకపోతే!