రాహుల్ మళ్లీ బుక్కయ్యాడుగా...

 

జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కారణమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం కేసులో కోర్టు మెట్లు ఎక్కాల్సివచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ లోని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన ఆరెస్సెస్ లోని మహిళలపై వివక్ష కొనసాగుతోందన్నారు. వారెప్పుడైనా నిక్కర్లు ధరించడం చూశారా? అని ప్రశ్నించి విమర్శలకు కారణమయ్యారు. ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ లో మగవాళ్లు కనిపిస్తారు కానీ, ఆ సంస్థ సభ్యత్వంతో ఆ సంస్థ యూనిఫారమ్ తో ఏనాడైనా మీరు మహిళలను చూశారా? ఆ సంస్థ ముఖ్య పదవుల్లో మహిళలు ఎవరైనా ఉన్నారా?’ అని రాహుల్ ప్రశ్నించారు. ‘‘బీజేపీకి ఆరెస్సెస్‌ ప్రధాన సంస్థ. అందులో ఎందరు మహిళలున్నారు? మీరేదైనా శాఖలోని మహిళలను షార్టులు వేసుకోగా చూశారా? నేనైతే ఎప్పుడూ చూడలేదు’’ అని అన్నారు. మహిళలు నోరు తెరవడాన్ని బీజేపీ, ఆరెస్సెస్ అంగీకరించవని, వారు మౌనంగా ఉండాలనే కోరుకుంటాయని ఆరోపించారు. వారి నోళ్లు మూయించేందుకు ఆ రెండూ పరుగులు తీస్తుంటాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే.. మహిళా సాధికారత కల్పిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మరి మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని రాహుల్ చెప్పినప్పటికీ.. ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం విమర్శలు తలెత్తుతున్నాయి. మరి దీనిపై రాహుల్ ఏం సమాధానం చెబుతాడో చూద్దాం...