రాహుల్ గాంధీ ఈజ్ బ్యాక్.. పొత్తుకు చర్చలు..

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. అప్పుడప్పుడూ రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకోవడానికి ఎవరికి చెప్పకుండా విదేశాలకు వెళ్లడం సహజం. ఈ నేపథ్యంలో ఆయన గత నెల రోజులపాటు విదేశీ టూర్ కు వెళ్లారు. నిన్న అర్ధరాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆయన భారత్ కు తిరిగి వస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన మాత్రం పూర్తి స్థాయిలో విశ్రాంతిని తీసుకున్న తర్వాత వచ్చారు. ఇక రాహుల్ రాకతో సోనియా గాంధీ కొడుకు రాహుల్‌ నివాసానికి వెళ్లారు. కొద్ది సేపటికి ప్రియాంక గాంధీ కూడా అక్కడికి చేరుకొని కీలక చర్చలు జరిపినట్టు సమాచారం. కీలకమైన పొత్తులు, పార్టీలోకి చేరికలు, అభ్యర్థుల జాబితా.. తదితర ఎన్నికల వ్యూహాలపై సోనియా, రాహుల్‌కు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అసలు పొత్తు విషయంపై రాహుల్ గాంధీ నిన్న అఖిలేశ్ తో భేటీ కావాల్సి ఉంది. కానీ రాహుల్ రాకపోవడంతో ఇక ఆలస్యం చేయకూడదని భావించి అఖిలేశ్‌ యాదవ్‌కు కూడా కబురు పంపినట్లు సమాచారం. మరి పొత్తు కుదురుతుందో.. లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.