జనాలకి గ్యాస్ కొడితే ఓట్లు రాలుతాయా?

 

రాహుల్ గాంధీ గత తొమ్మిదేళ్లుగా (కాంగ్రెస్ మార్క్) రాజకీయాలలో శిక్షణ పొందిన తరువాత ప్రధానమంత్రి పదవి చెప్పట్టేందుకు సిద్దపడ్డారు. కానీ ఆయన సమర్ధత గురించి ఆయన కంటే కాంగ్రెస్ కే బాగా తెలుసు గనుక, ఆయనను పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించకుండా, కేవలం ఎన్నికలలో పార్టీకి సారధ్యం వహిస్తారని ప్రకటించుకొంది. కానీ, ఆ బాధ్యతలు కూడా పూర్తిగా ఆయనకే అప్పగించే సాహసం చేయకపోవచ్చును. ఒకవేళ వచ్చే ఎన్నికలలో పార్టీ ఓడిపోతే ఆయనకు అప్రదిష్ట కలగకూడదనే ముందుచూపు కూడా ఉంది గనుక ఏదో ఒక కమిటీని ఆయనకు రక్షణ కవచంగా తొడిగి, వంది మాగధులను తోడిచ్చి ఎన్నికల యుద్ధానికి పంపవచ్చును.

 

అయితే, ఆయనకు దైర్యం కలగడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నిటానిక్కులు పట్టిస్తున్నా అవి అంతగా పనిచేయడం లేదనిపిస్తోంది. ఒంటిచేత్తో ఎన్నికల యుద్దంలో గెలిచేయడానికి తానేమి భీముడిని కానని ఆయన అన్నట్లు సమాచారం. ఆయన భీముడు కాకపోయినా, ప్రధాని పదవి చెప్పట్టేందుకు తాను అన్నివిధాల సమర్దుడనని నిరూపించుకొంటే సరిపోయేది. కానీ, ఆయన ఆ ప్రయత్నం చేయకుండా తను తొమ్మిదేళ్ళలో నేర్చుకొన్న కాంగ్రెస్ మార్క్ ఐడియాలనే జనాల మీద ప్రయోగిస్తున్నారు.

 

గుజరాత్ ఎన్నికలలో గెలిచేందుకు ఆరు సబ్సీడీ సిలెండర్లని తొమ్మిదికి పెంచినా ఫలం దక్కలేదు. అయినా ఏదో చిన్న ఆశతో ఆ తొమ్మిదిని వచ్చేఎన్నికల కోసం పన్నెండు చేయడానికి యువరాజావారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. సబ్సీడీ ఇచ్చుకొంటూ పోతే ఆయిలు కంపెనీలు మూసుకోవలసిందేనని గతంలో గట్టిగా వాదించిన ఆయిలు మంత్రి మొయిలీగారు ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయి, యువరాజవారి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని అప్పుడే ప్రకటించేసారు.

 

ఎన్నికలలో గెలిస్తే అప్పుడు ఎలాగూ మళ్ళీ కోతపెట్టే అవకాశం ఉంటుంది. ఓడిపోతే ఆ భారం బీజేపీ నెత్తిన పడుతుందని యువరాజవారు ఆలోచన అయిఉండవచ్చును. అయితే, పార్టీని, ప్రభుత్వాన్ని, దేశాన్ని సమూలంగా మార్చిపడేస్తానని చెపుతున్న యువరాజవారు ముందుగా ఇటువంటి ఆలోచనలను, అలవాట్లను, ట్రిక్కులను వదిలించుకొని తన మాటలకు, చేతలకు కొంతలో కొంతయినా సంబంధం ఉండేట్లు చూసుకొంటే ఆయన ఎన్నికలలో గెలవడం, ప్రధాని కావడం గురించి ఆలోచించవచ్చును. కేవలం గ్యాస్ కొట్టినంత మాత్రాన్నఓట్లు జలజల రాలిపోవని గుజరాత్ ఎన్నికలు నిరూపించాయి గనుక యువరాజవారు ఆ భ్రమలో నుండి బయటపడితే మంచిదేమో!