ప్రజల ప్రాణాలకు విలువలేదా రాహుల్ జీ?

 

రాజస్తాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తన నాయనమ్మ, తండ్రి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లే ఏదో ఒకరోజు తను కూడా చనిపోవచ్చునని, అయినప్పటికీ తను చావుకి భయపడనని జనాన్నిసెంటిమెంటుతో పడేయాలని చూసారు. అందుకే తను మతతత్వ పార్టీలను తీవ్రంగా వ్యతిరేఖిస్తానని ఆయన చెప్పారు.

 

నిజమే! ఉగ్రవాదాన్ని,మతత్వత్వాన్ని అందరూ ఖండించాల్సిందే. అందుకు కేవలం ఆయన కుటుంబ సభ్యులే కాక సాధారణ ప్రజలు కూడా వందలమంది ప్రతీ ఏటా బలయిపోతూనే ఉన్నారు. ఏనుగుకయినా చీమకయినా కాలు విరిగితే నొప్పి ఒకటే! ఏనుగు పెద్ద జంతువు గాబట్టి దానికి ఎక్కువ నొప్పి, చీమ చిన్నది గాబట్టి దానికి కొంచెం తక్కువ నొప్పి ఉండవని ఆయన గ్రహించాలి.

 

దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్నతన పార్టీ నేటికీ దేశంలో ఉగ్రవాదుల దాడులను, మత ఘర్షణలను ఎందుకు సమర్ధంగా అరికట్టలేకపోతోంది? పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోకి చొరబడి పట్టపగలే ప్రజల మీద, సైనికుల మీద, పోలీసుల మీద దాడులు చేసి నిత్యం అనేకమందిని పొట్టన పెట్టుకొంటుంటే చనిపోయినవారిని లెక్కబెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది?

 

చివరికి నిన్న హోం మంత్రి షిండే జమ్ములో పర్యటిస్తున్న సమయంలో కూడా పాక్ ఉగ్రవాదులు భారత సరిహద్దు దళాలపై కాల్పులు జరిపి ఒక భారత సైనికుడిని పొట్టన పెట్టుకొన్నాయి. మరి దేశంకోసం పోరాడిన ఆ వీర జవాను ప్రాణానికి విలువ లేదా?

 

తమ ప్రభుత్వం తప్పులని, అసమర్ధతను కప్పిపుచ్చుకొని, ఇంతవరకు ఎటువంటి మత ఘర్షణలు జరుగని రాజస్థాన్ రాష్ట్రంలో మత ఘర్షణల ప్రస్తావన తేవడం దేనికి? అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి?

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషి కారణంగానే ఆయనకు ప్రజలలో ఆదరణ పెరిగిన సంగతి కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకొంటే తాము ఏమి చేయాలో తెలిసివస్తుంది.

 

మాటలకి చేతలకి లంకె లేనప్పుడు అవి కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలే అవుతాయి అని ఆయన గ్రహిస్తే మంచిది.