అబ్బ మరీ ఇంత సెంటిమెంటయితే తట్టుకోలేము బాబు

 

మహాతల్లి ఇందిరమ్మ 'తన శరీరంలో చివరి రక్తం బొట్టుపోయే వరకు దేశసేవ చేస్తానని’ పలికిన కొద్దిరోజులకే హత్య చేయబడటంతో ఆమె మాటలకి చాలా విలువ ఏర్పడింది. ఇక నాటి నుండి నేటి వరకు గల్లీ నుండి డిల్లీ వరకు ప్రతీ రాజకీయ నాయకుడు ఈ లైన్స్ ని తమ ప్రసంగంలో విరివిగా వాడేసుకోవడం మొదలుపెట్టారు.

 

అయితే ఆమెలా నిజంగా చివరి రక్తం బొట్టు వరకు పనిచేస్తామని చెప్పేందుకు మాత్రం కాదు. ఒకవేళ కర్మకాలి ఎవరి చేతిలోనయినా చస్తే లేక ఏ గుండె జబ్బో వచ్చిమధ్యలో బకెట్ తన్నేసినా, పోయిన తరువాత కూడా జనాలు తమ గురించి చెప్పుకోడానికి ఓ నాలుగు ముక్కలుండాలానే తపనతోనే అందరూ తప్పనిసరిగా తమ ప్రసంగంలో, వీలయితే ట్వీటర్లో కూడా ఈ లైనుండేలా జాగ్రత్త పడుతున్నారు.

 

అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ ప్రసంగంలో మధ్య మధ్య సోనియా రాహుల్, అధిష్టానం వంటి పదాలను కలుపుకొని ప్రసంగించే ఆనవాయితీని ఎంత నిబద్దతగా పాటిస్తారో, అదేవిధంగా ఈ ‘చివరి రక్తం బొట్టు’, ‘నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు’ ఇత్యాది పదాలను పార్టీలకతీతంగా రాజకీయనాయకులు అందరూ కూడా తమ ప్రసంగంలో తప్పనిసరిగా చెప్పుకొంటారన్న మాట.

 

ఇక తాజా సమాచార్ ఏమిటంటే, ఇందిరమ్మ మనుమడు రాహుల్ గాంధీ కూడా తనకి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఎందుకని, ఆయన కూడా ఈ లైన్స్ అన్నిఎంచక్కా వల్లె వేసేసారు. ఈ రోజు రాజస్థాన్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన, తన తండ్రి, నాయనమ్మలాగే తన ప్రాణాలకి కూడా ప్రమాదం పొంచి ఉందని, ఉగ్రవాదం, మత తత్వవాదంపై పోరాడుతున్నతనను ఎవరయినా హత్య చేసే అవకాశం ఉందని తనకు తెలుసనీ, అయినా తాను ప్రాణాలు పోతాయని ఏనాడు భయపడలేదని, తనకు తన ప్రాణాలకంటే దేశమే ముఖ్యమని అని స్పష్టం చేసారు. అందువల్ల ప్రజలు కూడా ఈ మతతత్వానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపిచ్చారు.

 

అయితే అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులకు సహజంగానే ఆ ప్రమాదం పొంచి ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. అందువల్ల ఆయన మాటలను ఎవరూ కొట్టి పారేయలేరు కూడా. అయితే ఆయన బీజేపీ పాలిత రాష్ట్రానికి వచ్చి ఈ మాటలనడంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు రాహుల్ మాటలకి బీజేపీ నేతలు భుజాలు తడుముకొంటూ ఆయన మీద చాలా కోపగించుకొన్నారు.

 

కుంభకోణాలు తప్ప వేరేమి ఎరుగని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతకంటే వేరేమి మాట్లాడగలరని వారు విమర్శించారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన తమ పార్టీ గురించి, యుపీయే ప్రభుత్వం సాధించిన ఘన కార్యాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేనందునే ఈ సెంటిమెంటు డైలాగులతో జనాల సానుభూతి పొంది, దానిని ఓట్లుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు గుమ్మడి కాయలను మళ్ళీ రాహుల్ గాంధీ భుజన్నపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.