చాయిస్ ఈజ్ యువర్స్: రాహుల్ గాంధీ

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ, ఈ ఏడాదిలో జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలనీ, వచ్చే ఏడాది జరగనున్నసాధారణ ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తన పార్టీని బలపరిచే ప్రయత్నంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో, పీసీసీ మరియు శాసనసభా పక్ష నాయకులతో నిన్న,ఈరోజు డిల్లీలో సమావేశమవుతున్నారు. పార్టీని పూర్తీ స్థాయిలో ప్రక్షాళించే ప్రయత్నంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.

 

1. ఇకనుండి పార్టీ అభ్యున్నతికి పాటుపడినవారికి సముచిత పదవులు, పార్టీకి నష్టం కలిగించేవారికి, లేదా పార్టీలో పనిచేయనివారికి శిక్షా విధానం అమలుచేయాలని భావిస్తున్నారు.

 

2. ఎన్నికలలో పార్టీ టికెట్స్ ఆశించేవారు తాము అందుకు అన్నివిధాల అర్హులమని తప్పనిసరిగా నిరూపించుకొనవలసి ఉంటుంది.

 

3. పార్టీలో వర్గాలు, ముఠా సంస్కృతిని పోషించేవారిపై క్రమశిక్షణా చర్యలు.

 

4.పార్టీలో నేతలు మరియు కార్యకర్తలు అందరూ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పనిచేయడం కాకుండా, పార్టీని పటిష్టపరిచే విదంగా పనిచేయాలి. అందుకు ప్రతీ సభ్యుడు తనకు తానుగా కొన్నిబాధ్యతలను, లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా పనిచేయాలి. నిరంతరంగా కొనసాగే ఈ ప్రక్రియను, ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకొకసారి పార్టీ పరిశీలించి తమ బాధ్యతలను, లక్ష్యాలను నేరవేర్చినవారికి తదనుగుణంగా పదవులు ఇచ్చి గౌరవిస్తుంది.

 

5. పార్టీలో నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలుజేయాలి. హద్దులు దాటినవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పనిసరి.

 

రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు వినడానికి చాల బాగున్నాయి. కానీ, క్రమశిక్షణ రాహిత్యానికి, విపరీతమయిన స్వేచ్చకు, ముఠాతత్వానికి అలవాటుపడి ముదిరిపోయున్న కాంగ్రెస్ నేతలను తనకనుగుణంగా మార్చుకోవడం, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవడం కన్నాచాలా కష్టమయిన విషయం అని ఆయన త్వరలోనే గ్రహించవచ్చును. ఈ పరీక్షలో ఆయన నెగ్గితే, జవజీవాలు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక సమర్దుడయిన యువనాయకుడు దొరికినట్లే భావించవచ్చును. లేదంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు సాగుతున్న దారిలోనే కుంటుకొంటూ ముందుకు సాగవలసి ఉంటుంది.