తప్పులు పలుకుతోన్న రాహుల్… తిప్పలు తప్పని కాంగ్రెస్!

 

కాంగ్రెస్ ముక్త్ భారత్… ఈ నినాదం మోదీ నోట వచ్చింది మొదలు బ్యాడ్ టైం నడుస్తూనే వుంది హస్తం పార్టీకి! అయితే, అందుక్కారణం నిజంగా మోదీనో, మరో ఇతర పార్టీనో కాదు! స్వయంగా కాంగ్రెస్ హై కమాండే! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ! ఈ మధ్య చాలా రోజులుగా సోనియా యాక్టివ్ గా వుండటం లేదు. ఆమె పాల్గొనే మీటింగ్ లు, ఇస్తోన్న స్పీచ్ లు బాగా తగ్గిపోయాయి. ఆమె బాధ్యత తాను తీసుకోవాల్సిన రాహుల్ గాంధీ ఎప్పుడు ఇంట్లో వుంటాడో, ఎప్పుడు విదేశాలకు, ఎందుకు వెళాతాడో అర్థం కాని పరిస్థితి! దీనికి తోడు ఈ మధ్య కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నోరు తెరిస్తే చాలు వివాదాలు, వినోదాలు దొర్లిపొతున్నాయి. ఆయన మాట్లాడే తప్పులు పదే పదే సుబ్రమణ్యం స్వామి ముద్దుగా పిలిచిన పప్పు అన్న పదాన్నే గుర్తుకు తెస్తున్నాయి…

 

అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ డూ ఆర్ డై ఎన్నికలు ఎదుర్కోబోతోన్న రాష్ట్రం కర్ణాటక. గుజరాత్ లాంటి రాష్ట్రంలోనూ ఎన్నికలున్నా అక్కడ గెలుపు అవకాశాలు దాదాపు శూన్యం! ఇక మిగిలింది దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక. అయితే, అక్కడ సిద్ధరామయ్య సర్కార్ హడావిడి నిర్ణయాలు చూస్తుంటే కాంగ్రెస్ టెన్షన్ లో వున్నట్టు ఈజీగానే అర్థమైపోతోంది. తాజాగా ఇందిరా క్యాంటీన్స్ అంటూ ఓ కాపీ పథకం ప్రవేశపెట్టారు కన్నడ సీఎం. అందులో ప్రత్యేకతేం లేదు… తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్ల పేరుతో చేసిన పనే సిద్ధారామయ్య చేస్తున్నారు. అయితే, 5రూపాయలకు టిఫిన్, తక్కువ ధరకు భోజనం ఆల్రెడీ ఇంకా అనేక రాష్ట్రాల్లో అమల్లో వుంది. ఏపీలో , తెలంగాణలో, ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి చీప్ అండ్ బెస్ట్ క్యాంటీన్స్ విజయవంతంగా నడుస్తున్నాయి.

 

ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే… సిద్ధరామయ్య ఇంత ఆలస్యంగా బెంగుళూరులో ఇందిర క్యాంటీన్స్ ప్రారంభించటం ఆనందించాల్సిన విషయమే! కాని, తమాషా అంతా ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి వచ్చిన రాహుల్ స్పీచ్ తోనే జరిగింది. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ పేరున కన్నడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరా క్యాంటీన్స్ మొదలు పెడితే రాహుల్ అమ్మ క్యాంటీన్స్ అన్నాడు! మళ్లీ వెంటనే సర్దుకుని ఇందిర క్యాంటీన్స్ అన్నాడు. ఆ తరువాత, త్వరలోనే బెంగుళూరులోని అన్ని నగరాల్లో ఇందిర క్యాంటీన్లు మొదలవుతాయని అన్నాడు! బెంగుళూరు సిటీలో మళ్లీ వివిధ నగరాలు వుండటం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు! కేవలం 5నిమిషాలు సాగిన రాహుల్ స్పీచ్ లో ఒకట్రెండు సార్లు క్యాంటీన్ అనకుండా క్యాంపైన్ అన్నాడట కూడా!

 

ఉపన్యాసం ఇస్తున్నప్పుడు పొరపాట్లు జరగటం సహజం. దాన్ని సరదాగా తీసుకొని ఊరుకోవచ్చు. కాని, రాహుల్ భారతదేశ అతి పురాతన పార్టీకి ఉపాధ్యక్షుడుగా వుంటూ ఇలాంటి చిన్న చిన్న తప్పులు పదే పదే చేయటం… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది! ఆ మధ్య ఓ సారి గాంధీల వారసుడు ఆలూ కి ఫ్యాక్టరీ అన్నాడు! ఆలుగడ్డల కర్మాగారం అంటే అర్థం ఏంటో స్పీచ్ విన్న వారికి ఎవరికి అర్థం కాలేదు!

 

రాహుల్ గాంధీ పదాలు సరిగ్గా పలికినా పలక్కపోయినా కర్ణాటక కాంగ్రెస్ కు వచ్చే లాభం, నష్టం పెద్దగా వుండకపోవచ్చు. కాకపోతే, ఒక వైపు ఇందిర క్యాంటీన్ల ప్రారంభోత్సవ హడావిడిలో సీఎం తలమునకలైతే… మరో వైపు బెంగుళూరు నగరం మొత్తం గత శతాబ్దంలో ఎప్పుడూ లేని విధంగా భీభత్సమైన వర్షాన్ని ఎదుర్కొంది. ఆ వర్షం నుంచి ఇంకా తేరుకోక ముందే రాహుల్ వచ్చి క్యాంటీన్లు ప్రారంభించాడు. ఆయన రాక కోసం గంటల తరబడి రోడ్లు మూసి వేయటంతో జనం విపరీతమైన అసహనానికి లోనయ్యారట! అలాగే చాలా చోట్ల ఈ సరికొత్త ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు స్థానికులు వ్యతిరేకిస్తున్నారట. క్యాంటిన్ల నిర్వహణ వల్ల వచ్చి పడే చెత్తా, చెదారం గురించి ఆందోళన చెందుతున్నారట!

 

ఇందిరా క్యాంటీన్ల పథకం కన్నడ కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు తెచ్చి పెడుతుందో చూడాలి …