కాంగ్రెస్ పార్టీయే రాహుల్ గాంధీకి దిశానిర్దేశం చేయాలేమో?

 

రాహుల్ గాంధీ భూసేకరణ చట్టానికి సవరణలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయన చేస్తున్న ఈ పోరాటాల గురించి పార్టీలో సీనియర్ నేతలెవరూ అసలు పెదవి విప్పడం లేదు. ప్రతిపక్ష నేతలు ఎవరయినా ఆయనని విమర్శిస్తే అప్పుడు మాత్రం ఏదో మొక్కుబడిగా వాటిని ఖండిస్తున్నారు. అంటే ఆయన చేస్తున్న పోరాటానికి వారి మద్దతు లేదనే విషయం స్పష్టం అవుతోంది.

 

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై అంతర్గతంగా సాగుతున్న చర్చను, పార్టీ శ్రేణులపై దాని ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకే రాహుల్ గాంధీ ఇంత శ్రమపడుతున్నారేమో? బహుశః అందుకే ఆయన ప్రతీ సమస్యకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యుడని నిందిస్తున్నారేమో? ఇప్పుడు దేశ విదేశాలలో మోడీ పేరు మారుమ్రోగిపోతోంది. అటువంటి వ్యక్తిని ఎదిరించడం ద్వారా రాహుల్ గాంధీ తనకూ ఆయనను డ్డీ కొట్టే సాహసం ఉందని నిరూపించుకొని తన పార్టీ నేతలను, కార్యకర్తలను ఆకట్టుకోవాలని చూస్తున్నారేమో?

 

“రైతుల విషయంలో మోడీ అనుసరిస్తున్న విధానాలకి తను సున్నా మార్కులు వేస్తానని, కానీ కార్పోరేట్ సంస్థలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు సహాయం పడటంలో నూటికి నూరు మార్కులు వేస్తానని” రాహుల్ గాంధీ చెప్పడం చూస్తే తను మోడీకే మార్కులు వేసేంత గొప్పవాడినని చెప్పుకొని తన రాజకీయ అపరిపక్వత చాటుకొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇక రాహుల్ గాంధీ చేస్తున్న ఫ్లయింగ్ పాదయాత్రల వలన ఆ పార్టీకి ఏ ప్రయోజనమూ చేకూర్చలేకపోయినా, పాదయాత్రలు చేసిన ప్రతీ చోట విమర్శల మాత్రం మూటగట్టుకొని వెళుతున్నారు. ఇంతవరకు భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ఇప్పుడు తన నియోజక వర్గమయిన అమేధీలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు గురించి పోరాటం చేస్తానని ప్రకటించడాన్ని గమనిస్తే ఆయన పోరాటం ప్రజల కోసమా లేక తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనా? అనే అనుమానం కలుగకమానదు.

 

అక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటుకి తమ యూపీఏ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే, తనపై రాజకీయ కక్షతోనే దానిని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ దానిని తిరిగి సాధించేవరకు తన పోరాటం ఆగదని రాహుల్ గాంధీ ప్రకటించారు. కానీ అక్కడ 2010 సం.లో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వమే అనుమతించిందని, కానీ 2012 సం.వరకు అక్కడ పనులు మొదలుపెట్టకపోవడంతో మళ్ళీ యూపీఏ ప్రభుత్వమే సదరు ప్రమోటర్లకు స్థలం, లైసెన్స్ రద్దు చేసేందుకు నోటీసులు జారీ చేసిందని కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ మీడియాకు తెలిపారు. రాహుల్ గాంధీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు జవాబిచ్చారు.

 

ఫుడ్ పార్క్ ఏర్పాటు విషయంలో ఎవరి వాదనలు వారికుండవచ్చును. కానీ 2010లోనే అక్కడ ఫుడ్ పార్కో లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రమో ఏర్పాటు చేసేందుకు యూపీఏ ప్రభుత్వమే అనుమతులు మంజూరు చేసినప్పుడు, దానిని యూపీఏ హాయంలోనే నిర్మాణం పూర్తి చేసేందుకు రాహుల్ గాంధీ ఎందుకు చొరవ తీసుకోలేదు. ఐదేళ్ళ తరువాత కూడా నిర్మాణం కాని సంస్థ గురించి ఆయన ఇప్పుడు ఎందుకు పోరాటం మొదలుపెట్టారు? అని ఆలోచిస్తే ఆయన మొదలుపెట్టిన ఈ పోరాటం దేనికో అర్ధమవుతుంది.

 

కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించలేకనే రాహుల్ గాంధీ రెండు నెలలు శలవు అంటూ విదేశాలకు వెళ్ళిపోయారు. తిరిగివచ్చిన తరువాతయినా ముందుగా ఆ సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేసి, ఆ తరువాత ఆయన ఎటువంటి పోరాటాలు చేసినా పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలిచేది. కానీ ఇంటిని చక్క దిద్దుకోకుండా దేశాన్ని చక్క దిద్దేందుకు బయలుదేరితే అప్పుడు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్లు ఉంటుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేయగలరో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అగమ్యంగా తిరుగుతున్న ఆయనకే పార్టీ దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉన్నట్లు కనబడుతోంది.