TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాక్షి క‌థ‌నంలానే సీబీఐ కోర్టు తీర్పు!.. సుప్రీంకోర్టుకు వెళ్తాన‌న్న ర‌ఘురామ‌..

Published on: Wed Sep 15, 2021 3:17PM

ర‌ఘురామ అనుమానించిన‌ట్టే  జ‌రిగింది. సీబీఐ కోర్టు జ‌గ‌న్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ర‌ఘురామ దాఖ‌లు చేసిన జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిల‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. 

అక్రమాస్తుల కేసుపై సీబీఐ న్యాయస్థానంలో రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది. బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంలో సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని.. అందువల్ల వారి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. వెంట‌నే ఆ ఇద్ద‌రి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. 

అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారని జగన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసింది. 

సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అప్ప‌ట్లో సాక్షిలో క‌థ‌నం వ‌చ్చిన‌ట్టుగానే.. సీబీఐ కోర్టు తీర్పు ఉంద‌ని అన్నారు. జ‌డ్జిమెంట్‌పై హైకోర్టులో రివ్యూ పిటిష‌న్ వేస్తాన‌ని.. అక్క‌డ కూడా వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాన‌ని ఎంపీ ర‌ఘురామ తేల్చిచెప్పారు.