మతిస్థిమితం లేనివారు దోషులంట.. మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా.. ఎంపీ రఘురామరాజు ఫైర్

ఏపీలో కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు గాంధేయ పద్ధతిలో ఈ రోజు ఉదయం 9 గంటలకు తన ఢిల్లీ నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ‌తి స్థిమితం లేని వారు కేవ‌లం హిందూ దేవాల‌యాల‌ను, ర‌థాల‌ను మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుంటున్నారా అంటూ అయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న దాడులపై జగన్ స‌ర్కారు చెబుతున్న స‌మాధానం స‌రికాద‌ని ఆయన మండిప‌డ్డారు. అంతేకాకుండా రాష్ట్ర దేవాదాయ మంత్రి వెల్లంపల్లి మ‌తిలేకుండా మాట్లాడుతున్నార‌ని రఘురామరాజు విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ ప్రస్తుత క‌రోనా విప‌త్తు స‌మ‌యంలోనూ దీనికి సంబంధించి ప్ర‌జ‌లు త‌మ నిర‌స‌న‌ తెలియ‌జేసేందుకు రోడ్ల మీద‌కు వ‌స్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

 

ఈ సందర్బంగా అయన విడుదల చేసిన ప్రకటన సారాంశం:

గడచిన సంవత్సరకాలంలో ఏపీలో వరుసగా మొత్తం 15 దేవాలయాలపై దాడులు జరిగాయి. పిఠాపురం, కొండబిట్రగుంట తాజాగా అంతర్వేదిలలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇవి యాధృచ్ఛికంగా జరిగినవి కావని స్పష్టం అవుతుంది. ఇటువంటి సంఘటనలను మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అంటూ ఒక రకంగా వీటిని సమర్ధించే ప్రయత్నం చేయడం నవ్వులాటగా కనిపిస్తున్నది. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటె మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగి ఉండేదా అని ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. వరుస సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పెద్దలు మద్దతుతోనే అవి జరుగుతున్నట్లు భక్తులు భావించే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జరుగుతూ ఉండడం, హిందూ దేవాలయాల భూములపై పలుకుబడి గలిగిన వారు కన్నేసి కైవసం చేసుకొనే ప్రయత్నం చేస్తుండడం గమనిస్తే ఈ దాడులు ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు వెల్లడి అవుతుంది. ప్రస్తుతం ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు నేడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగు నష్ట నివారణ చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితులు అనూహ్యమైన మలుపు తీసుకొనే అవకాశం ఉంటుందని గ్రహించాలి.

 

సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురంలో.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠంలో ఈ సంఘటనల పరంపర ప్రారంభమైనది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారు అంటే అపుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్నా సమాధానం మాత్రం ఒకే రకంగా ఉండడంతో, అవ్వన్నీ ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు భావించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, అలాగే సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి వివాధాలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు వరుసగా జరుగుతున్న దాడులను తీవ్రమైన అంశంగా పరిగణించి, తక్షణం తగు చర్యలు తీసుకోవడం ద్వారా హిందువుల మనోహభావాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. టిటిడి భూములను అమ్మివేసే ప్రయత్నం జరిగినప్పుడు ప్రజలనుండి పెద్ద ఎత్తున ఎదురైన ఆగ్రవేశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి సకాలంలో స్పందించి, ఆ మొత్తం పక్రియను రద్దు చేయడంతో ఒక పెద్ద ఉపద్రవాన్ని నివారింప గలిగారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేయవలసి ఉంది. లేని పక్షంలో పరిస్థితులు అదుపు తప్పవచ్చనే ఆందోళన కలుగుతున్నది.

 

అంతర్వేది వద్ద భారీ సంఖ్యలో హిందూ సంస్థలకు చెందిన వారు ఆగ్రవేశాలతో దేవాలయాన్ని చుట్టుముట్టినపుడు మంత్రులు లోపల గంటలపాటు నిలబడవలసి రావడం గమనిస్తే ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోని పక్షంలో వచ్చే తీవ్ర పరిణామాలకు సంకేతం ఇచ్చిన్నట్లయింది. కేవలం హిందూ మతం విషయంలో మాత్రమే ప్రభుత్వం స్పందించడం లేదని అభిప్రాయం ప్రజలలో బలంగా నెలకొనడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఏ మతంపై చెందినవైనా ప్రార్ధనా మందిరాల పట్ల ప్రజల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంకు ఉంటుంది. ప్రభుత్వం కేవలం ఒక ప్రత్యేక మతం చెందిన వారిని ఆదరిస్తూ మిగిలిన వారి పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నదని అభిప్రాయం కలగడం ఏ లౌకిక ప్రభుత్వంకు కూడా మంచిది కాదు. రాజకీయంగా తీవ్ర మూల్యాన్ని చెల్లించే పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని దేశంలో నేడు పలు చోట్ల జరుగుతున్న పరిణామాలను చూసైనా గ్రహించాలి. చెప్పుకోదగిన ఆస్తులు, ఆదాయాలున్న దేవాలయాలను ఎంపిక చేసి, వాటి లక్ష్యంగా దాడులు జరుపుతూ, వాటిని కైవసం చేసుకొనే ప్రయత్నం రాజకీయ నాయకత్వం మద్దతుతోనే జరుగుతున్నట్లు ఈ సందర్భంగా ప్రజలలో అనుమానాలు చెలరేగడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. వరుసగా జరుగుతున్న సంఘటనలను యాదృచ్చికంగా జరిగినవిగా కాకుండా, వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తించి, వాటి వెనుక ఉన్న శక్తులను కనిపెట్టేందుకు ప్రభుత్వం నిష్పాక్షికంగా అన్ని సంఘటనలను కలిపి దర్యాప్తు జరిపించాలి.