నేను పవన్ ఫ్యాన్‌ను.. ఎక్కడ తగ్గాలో తెలుసు.. రఘురామ సంచలనం
Published on: Wed Jan 12, 2022 11:51AM
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ ఇది. సేమ్ టు సేమ్.. ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతానంటున్నారు ఎంపీ రఘురామ. తాను పవన్ కల్యాణ్ అభిమానినని కూడా చెప్పారు. ఇక తగ్గేదేలే అనకుండా.. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి నెగ్గుతానంటున్నారు.
రఘురామ నరసాపురం వస్తానని చెప్పడంతో.. ఏపీ ప్రభుత్వం ఉలిక్కిపడినట్టుంది. ఆయన వచ్చే ముందురోజే ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటిలో వాలిపోయారు. పాత కేసులో కొత్తగా విచారణ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈనెల 13న లేదంటే.. 17న.. తమ ముందు హాజరుకావాలని హుకూం జారీ చేశారు.
రాను పో.. ఏం చేస్తారో చేసుకోండంటే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికంటే రఘురామకే బాగా తెలుసు. అందుకే, ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని.. అంటూ 17వ తేదీన విచారణకు వస్తానన్నారు రఘురామ. ఇలా తగ్గి నెగ్గారు రఘురామ. ఒకవేళ రఘురామ విచారణకు డుమ్మా కొడితే.. ఆ సాకుతో ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చనుకున్నారు ఏపీ సీఐడీ. కానీ, ఈయన మాత్రం పిలవంగానే వస్తానంటూ చెప్పేయడంతో.. మేటర్ స్మూత్‌గా మారడం సీఐడీకి అసంతృప్తిని మిగిల్చిందని అంటున్నారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగానే.. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి నెగ్గారు రఘురామ.
ఇక, రఘురామ తాను పీకే ఫ్యాన్‌నంటూ చెప్పడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. త్వరలోనే తాను రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించేశారు రఘురామ. అమరావతి నినాదంతో.. రాక్షస పాలనపై రెఫరెండంగా.. నరసాపురం నుంచి మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతారా? లేదంటే, ప్రచారంలో ఉన్నట్టు బీజేపీలో చేరి, పువ్వు గుర్తుపై పోటీ చేస్తారా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అంతలోనే తాను పవన్ అభిమానినంటూ ప్రకటించడం.. బహుషా ఆయన బీజేపీలో చేరితే.. ఆ పార్టీకి మిత్రపక్షమైన జనసేన మద్దతు కోసమే ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని అంటున్నారు. ఏది ఏమైనా.. రఘురామను ఎంతో ఇబ్బంది పెడదామనుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి చిక్కకుండా.. చాకచక్యంగా చుక్కలు చూపిస్తున్నారు రఘురామ. రాజు గారా మజాకా...


