సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. అరెస్ట్ తప్పదా?
Published on: Mon Jan 17, 2022 11:35AM
సీఐడీ పోలీసులు విచారణకు రమ్మన్నారు. తాను రాలేనన్నారు. మామూలుగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, అక్కడున్నది వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ. అందుకే ఇదిప్పుడు బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. సీఐడీ వర్సెస్ రఘురామ ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందోననే ఉత్కంఠ రేపుతోంది.
ఏపీ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌లోని నివాసంలో సంక్రాంతికి ముందు సీఐడీ అధికారులు రఘురామకు నోటీసులు ఇచ్చారు. జనవరి 17న రఘురామ సీఐడీ విచారణకు హాజరుకావాలని సూచించారు. అందుకు సరేనన్న రఘురామ.. లేటెస్ట్‌గా తాను విచారణకు రాలేనంటూ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో తెలిపారు రఘురామ. ఢిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యారని.. విచారణకు హాజరయ్యేందుకు 4 వారాలు గడువు కావాలని కోరారు. మరి, రఘురామ విజ్ఞప్తిపై ఏపీ సీఐడీ ఎలా స్పందిస్తుందో మరి. అసలే రఘురామ.. ఇదే ఛాన్స్ అంటూ, విచారణకు రాలేదంటూ.. మరోసారి ఆయన్ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.


