TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రిజర్వ్ బ్యాంక్‌ గవర్నరుని తొలగిస్తారా?

Published on: Tue May 17, 2016 2:32PM


మన దేశ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నరుగా రఘురామ్‌ రాజన్‌ గురించి తెలియని వారుండరు. ద్రవ్యపరమైన విధానాల గురించీ, దేశంలోని ఆర్థిక పరిస్థితుల గురించి కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే రఘురామ్‌ తరచూ వార్తల్లో కనిపించడమే దీనికి కారణం కావచ్చు. కానీ నిష్కర్షగా మాట్లాడే ఆయన తీరే ఇప్పుడు రఘురామ్‌ పదవికి ఎసరు తెచ్చినట్లుంది. ఈ ఏడాదితో మూడేళ్ల పదవీకాలాన్ని ముగించనున్న రఘురామ్‌ను మరికొద్ది రోజులు పదవిలో కొనసాగించాలనే అభిప్రాయం తొలుత ఉండేది. కానీ రానురానూ ఆయన పట్ల బీజేపీలో వ్యతిరేకత మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సాటి తమిళ తంబి అని కూడా చూడకుండా సుబ్రమణ్య స్వామి తరచూ రఘురామ్‌ మీద విరుచుకుపడుతున్నారు. ఎప్పుడూ సోనియాని దుయ్యబట్టే సుబ్రమణ్యం ప్రస్తుతం రఘురామ్‌ను తన లక్ష్యంగా చేసుకున్నట్లున్నారు. వడ్డీ రేట్ల మార్పు, మొండి బకాయిలు వంటి విషయాలలో రఘురామ్ తీరు మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేదిగా ఉందన్నది స్వామి ఆరోపణ. రఘురామ్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల పరిశ్రమలు విఘాతం కలిగిందనీ, లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారన్నది ఆయన ప్రధాన విమర్శ. స్వామి కేవలం పైపై విమర్శలతో సరిపుచ్చుకోలేదు. రఘురామ్‌ను వీలైనంత త్వరగా ఆ పదవి నుంచి పీకేయమంటూ ఏకంగా ప్రధానమంత్రి మోదీకి ఓ ఘాటైన ఉత్తరం కూడా రాశారు. అమెరికా గ్రీన్‌ కార్డుని వదులుకోని రఘురామ్‌, మానసికంగా భారతీయుడు కాడనీ... ఆయనలో జాతీయ భావాలు లేవనీ స్వామి తన ఉత్తరంలో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ కూడా రఘురామ్‌ను పదవిలో కొనసాగించే విషయాన్ని దాటవేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మన ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్ల గురించి నిర్ద్వంద్వంగా తన అభిప్రాయాలు తెలియచేసే రఘురామ్ మాజీగా మిగిలిపోవడంలో మరెన్నో రోజులు పట్టకపోవచ్చు.