TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీకి బొమ్మా బొరుసూ ఈటల, రఘునందనరావేనా?

Published on: Mon Jul 3, 2023 5:38PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తెలంగాణ లో బీజేపీ గాలి తీసేశారు. రాష్ట్రంలో బీజేపీ అంటే తానూ ఈటలేననీ, కమలం గుర్తు చివరన వస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు తరుణ్ భుజ్ ను చూసి కాదనీ, తమను చూసి పడతాయనీ అన్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలు అధిష్ఠానానికి ఏమీ తెలియదని కుండ బద్దలు కొట్టారు. హస్తినలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షానికి నాయకుడు లేడన్న విషయం కూడా తెలియని స్థితిలో మా పార్టీ జాతీయాధ్యక్షుడు ఉన్నారని రఘునందనరావు అన్నారు. 

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుందనీ, ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనలో ఉన్న బీజేపీ హై కమాండ్ కు దెబ్బ మీద దెబ్బగా రఘునందనరావు వ్యాఖ్యలు ఉన్నాయి. బండి సంజయ్ ను రాష్ట్ర బీజేపీ చీఫ్ గా మార్చేస్తారన్న ప్రచారం వాస్తవమేనని ఆయన బాహాటంగా చెప్పేశారు. అంతే కాకుండా బండి సంజయ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భార్య పుస్తెలమ్మి ఎన్నికలలో పోటీ చేసిన బండి సంజయ్ కు కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేసే సొమ్ము ఎక్కడిదన్న రఘునందనరావు.. ఒక వేళ అది పార్టీ సొమ్మయితే అందులో తనకూ వాటా ఉందని అన్నారు.  

మొత్తం మీద తెలంగాణ బీజేపీకి  తానూ, ఈటల బొమ్మాబొరుసు వంటి వారమని చెప్పిన రఘునందనరావు.. ఇన్నేళ్లలో పార్టీ కోసం తన కంటే ఎక్కువగా కష్టపడిన వారెవరూ లేరని చెప్పుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలను ఆయన హస్తిన వేదికగా బహిర్గతం చేసేశారు. బండి మార్పుపై వస్తున్నవి ఊహాగానాలు కాదని కుండ బద్దలు కొట్టేశారు. కేంద్ర కేబినెట్ జరుగుతున్న వేళ రఘునందనరావు చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో బీజేపీలో ప్రకంపనలు రేపుతాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న ప్రచారానికీ బలం చేకూర్చాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి తన కంటే అర్హుడెవరున్నారని ఆయన అన్యాపదేశంగానైనా గట్టిగా చెప్పారు. తన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని బలగా చాటారు.

ఇంత కాలం ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని వాపునే బలంగా చెప్పుకున్న బీజేపీకి తెలంగాణలో ఉన్న వాస్తవ బలం ఏమిటన్నది ఇప్పుడు బహిర్గతమైపోయింది. అధికారం ఖాయమంటూ ఇంత కాలం చేసుకున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గడ్కరీయే అవాస్తవమంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేశారు. తెలంగాణలో తమ స్థాయి విపక్షానికే పరిమితమని విస్ఫష్టంగా తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దూరంగానే ఉంటుందన్నది తేటతెల్లమైపోయినట్లేనని రఘునందనరావు వ్యాఖ్యలతో అర్ధమైపోయింది.