బిజేపీ భోఫోర్స్

రెండూ జాతీయ పార్టీలే, రెండూ దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలే, రెండూ గొప్ప గొప్ప నాయకులను, మేథావులను దేశానికి అందించిన పార్టీలే. ఇన్నాళ్లూ ఒక పార్టీ మరొక పార్టీకి సరిపోలదని, తాము "డిఫరెంట్" అని గొప్పలు చెప్పుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీలూ దొందుకు దొందూ ఒకటేనని, రెండూ ఒకే తానులో ముక్కలని మెల్లమెల్లగా బయట పడుతోంది. ఆ రెండు జాతీయ పార్టీలలో ఒకటి కాంగ్రెస్ అయితే మరొకటి భారతీయ జనతా పార్టీ. కుంభకోణాలకు, అవినీతికి తాము దూరమని చెబుతున్న భారతీయ జనతా పార్టీ కుంభకోణాలలో కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ కాదని మెల్లమెల్లగా రుజువవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారమే. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఒక్కొక్క కుంభకోణం వెలుగులోకి వస్తున్నాయి.

 

 

తాజాగా యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారం లోక్‌సభ సాక్షిగా బయటపడింది . దీంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి వ్యవహారం బట్టబయలు అయ్యింది. తెలుగు వారి కోడలు పరకాల నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చేసిన సెల్ఫ్ గోల్‌తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో  అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాఫెల్ విమానాల కొనుగోలు కుట్ర బహిర్గతమైంది. ఈ చర్చలో మాట్లాడిన రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ధరలను వెల్లడించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. 

 

 

దీనిపై సమాధానం చెప్పిన నిర్మలా సీతారామన్ విమానాల కొనుగోలు ఒప్పందం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిందని  వెల్లడించారు. అదే ఇప్పుడు బిజేపిని ఇరుకున పెడుతోంది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యుద్ధ విమానాల తయారీ సంస్ధ రాఫెల్  మన జాబితాలోనే లేదని బయటపడింది. ఈ విషయాన్ని అప్పటి రక్షణ మంత్రి ఏ.కే. ఆంటోని ప్రకటించడం తాజా సంచలనం. రాఫెల్ యుద్ధ విమానాల ధరలు కూడా ఈ వివాదంలో కీలకంగా మారాయి. ఈ యుద్ధ విమానం ధర ఒక్కొక్కటి  560 కోట్లు. రాఫెల్ యుద్ధ విమానం ధర 740 కోట్లు. ఎన్‌డిఏ ప్రభుత్వం వీటికి 1670 కోట్లు వెచ్చించినట్లు తేలింది. దీంతో దేశ ఖజానాకు దాదాపు 13000 కోట్లు నష్టం వాటిల్లింది. ఇదే బిజేపి ప్రభుత్వాన్ని ఇరుకున  పెడుతోంది. ఇన్నాళ్లు మచ్చ లేదంటూ బడాయిపోయిన నరేంద్ర మోదీ దీనికి ఏం సమాధానం చెప్తారని కాంగ్రెస్ ప్రశ్నింస్తోంది.

 

 

ఇంతకు ముందు రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన భోఫోర్స్ కుంభకోణం మాదిరిగానే ఈ రాఫెల్ కుంభకోణం కూడా వెలుగు చూసిందని దేశమంతటా ప్రచారం జరుగుతోంది. నాటి భోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీని పదవికి దూరం చేస్తే ... ఈ రాఫెల్ కుంభకోణం ప్రధాని నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని ఏం చేస్తుందో వేచి చూడాలి. దేశాన్ని కుదిపేయనున్న రాఫెల్ కుంభకోణం వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఆయుధం కానుంది.