భారత్ నేలపై దిగిన రాఫెల్
Published on: Wed Jul 29, 2020 4:57PM

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోకి ప్రపంచంలోనే అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు కొద్దీ సేపటి క్రితం వచ్చి చేరాయి. అంబాలాలోని ఎయిర్ బేస్ కు తొలి బ్యాచ్ లోని ఐదు జెట్ విమానాలు చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ ఫైటర్ జెట్లు దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ భూభాగం పై ల్యాండ్ అయ్యాయి. గోల్డెన్ యారోస్ గా పిలిచే నెంబర్ 17 స్క్వాడ్రన్ లో వీటిని చేర్చనున్నారు.
రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలాలోని ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయిన వెంటనే కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "లోహ విహంగాలు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. రాఫెల్ విమానాలు మన గడ్డను తాకిన క్షణం నుండి భారత మిలిటరీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. మన వాయుసేన శక్తి సామర్థ్యాలు ఈ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో మరింత పెరగనున్నాయి" అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
ఒక పక్క భారత్ తో కయ్యానికి చైనా కాలుదువ్వుతున్న సమయంలో ఈ ఫైటర్ ప్లేన్స్ మన వాయుసేనలో చేరడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతే కాకుండా ఇలాంటి యుద్ధ విమానాలు చైనా వద్ద కూడా లేకపోవడం గమనార్హం. మొత్తం 36 రాఫెల్ జెట్స్ కోసం ఫ్రెంచ్ ఏరో స్పేస్ కంపెనీ "డస్సాల్ట్ ఏవియేషన్" తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన విమానాలు విడతల వారీగా మనకు అందనున్నాయి.


