రాజుకుంటున్న రాఫెల్

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం నానాటికీ రాజకుంటోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలను కుదిపేసిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం తాజాగా భారతీయ జనతా పార్టీ మాజీ నాయకుల నుంచి విమర్శలకు దారి తీసింది. దీంతో భారతీయ జనతా పార్టీ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. లోక్‌సభలోను, రాజ్యసభలోనూ  భారతీయ జనతా పార్టీని... ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి, తెలుగు వారి కోడలు నిర్మలా సీతారామన్ మెడకు చుట్టుకుంది. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు...ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రమే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై విరుచుకుపడ్డారు.

 

దీంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా అందరూ ఈ కుంభకోణంలో ఏమీ లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర వివాదమనే భావించాలరు. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వాజపేయి ప్రభుత్వంలో  మంత్రులుగా చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో  పెద్ద కుంభకోణమే జరిగిందంటూ రోడెక్కారు.  దీంతో బిజెపి ప్రభుత్వం రక్షణలో పడింది. మరో ముఖ్యంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో బోఫోర్స్ కుంభకోణాన్ని వెలికి తీసి జాతీయ స్థాయిలో ఆ మాటకొస్తే అంతర్జాతీయ స్ధాయిలో పేరు తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు అరుణ్ శౌరీ ఈ రాఫెల్ ఉదంతంపై పెదవి విప్పడంతో జాతీయ స్ధాయిలో అందరి చూపు రాఫెల్ వైపు మళ్లింది. అరుణ్ శౌరి అయితే ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం బోఫోర్స్ కంటే చాలా పెద్ద కుంభకోణమని తేల్చారు.

 

ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీయే ఈ రాఫెల్ కుంభకోణానికి సూత్రధారి అని నిప్పులు చెరిగారు. ఈ కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రి వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు దారి తీస్తోందని వారిద్దరు ఆరోసిస్తున్నారు. అయితే వాస్తవాలు కూడా వారి వాదనకే బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి, తెలుగు వారి కోడలు నిర్మలా సీతారామన్ మార్చి మార్చి చేస్తున్న ప్రకటనలు కూడా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై అనుమానాలు రెకెత్తిస్తోంది. ఇంతకు ముందు చేసుకున్న విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారన్నది అందరినీ దొలుస్తున్న ప్రశ్న. ఇలా చేయాలని వైమానిక దళం ప్రభుత్వాన్ని కోరిందా. అలా అయితే సంబంధిత పత్రాలు ఏమయ్యాయి అన్నది ప్రధాన ప్రశ్న. వేల కోట్ల రూపాయల ఒప్పందానికి చెందిన పత్రాలు అన్నీ ప్రభుత్వం దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా... అన్నది మౌలిక ప్రశ్న. పాత ఒప్పందాల రద్దు అనంతరం కొత్త ఒప్పందాలను వైమానిక దళం పరిశీలించిందా...? లేక ఆర్ధిక లబ్ది కోసం ప్రభుత్వమే ఈ ఒప్పందాలను మార్చిందా...? అన్నది మరో ప్రధాన ప్రశ్న. ఒకవేళ రెండోదే జరిగితే దీనికి పూర్తి బాధ్యత నరేంద్రమోదీ, రక్షణమంత్రి నిర్మాల సీతారామన్‌లదే అవుతుంది. తమకు ఎలాంటి విమానాలు కావాలో... వాటి నాణ్యత, ధర వంటివి నిర్ణయించాల్సింది రక్షణ శాఖే. వారిని సంప్రదించకుండా ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం నడిచిందంటే ఇందులో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లుగానే భావించాలి.

 

 

రాఫెల్ యుద్ధ విమానాల తొలి కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ప్రభుత్వం మళ్లీ మరోసారి కొనుగోలు చేయడానికి టెండర్లు పిలవాలి కదా... ? కాని ప్రభుత్వం అలా ఎందుకు చేయలేదన్నది దేశమంతా అడుగుతున్న ప్రశ్న. దీనికి ప్రధాని, రక్షణ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంది. కుంభకోణంలో ప్రధాన అంశం ఈ కాంట్రాక్ట్‌ను రక్షణ వ్యవహారాలు, యుద్ధ విమానాల కొనుగోలు అంశాలపై కనీస అనుభవం కూడా లేని అనీల్ అంబానీ సంస్ధకు అప్పగించడం కూడా వివాదమవుతోంది. ఇది దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేస్తున్న వ్యవహారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కుంభకోణం గురించి ముందే ప్రధాన మంత్రి ఊహించి ప్రభుత్వ రక్షణ కోసం కీలకమైన రక్షణ శాఖకు మహిళను మంత్రిని చేశారా... ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే యుద్ధ విమానాలకు సంబంధించిన డబ్బు చేతులు మారిందంటున్నారు. అదే జరిగితే విమానాలు ఇంకా ఎందుకు రాలేదన్నది కూడా పెద్ద ప్రశ్న.

 

 

ఈ 36 విమానాలు ఒప్పందం కుదిరిన రెండేళ్లలో వస్తాయని అప్పట్లో చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క విమానం కూడా భారత్‌కు చేరకపోవడానికి ఏమని సమాధానం చెప్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని ఏ విషయంలోనూ ఇరుకున్న పెట్టలేకపోతున్న ప్రతిపక్షాలకు ఈ రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారం పెద్ద ఆయుధమనే చెప్పాలి. ఈ ఆయుధంతోనే రాబో‍యే ఎన్నికల్లో ప్రతిపక్షాలు... మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోనుంది. చూడాలి.. రానున్న ఏడాది కాలంలో ఇంకెన్ని కుంభకోణాలు బయట పడతాయో...? బయటపడిన కుంభకోణాలు ఎలా తెరమరుగవుతాయో....? తేలాలంటే మరో ఏడాది ఆగాల్సిందే....