TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికన్ జాత్యహంకారం పొట్టన పెట్టుకున్న శ్రీనివాస్ లు ఎందరో!

Published on: Thu Mar 2, 2017 5:33PM

ఇప్పుడు అమెరికా అమెరికా కాదు! ట్రంప్స్ అమెరికా! ట్రంప్ వాదం, సిద్ధాంతం మొదట్లో అందరికీ కామెడీగా అనిపించింది. కాని, అదే తరువాత తరువాత అందర్నీ ఆకర్షించింది. చివరకు ఎన్నికల్లో అతడ్ని అధ్యక్షుడ్ని కూడా చేసి విభ్రాంతికి గురి చేసింది! ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు ఎన్ని కలలో మూటగట్టుకుని అమెరికా పోయిన మన శ్రీనివాస్ కూచిభోట్ల లాంటి వార్ని పొట్టనపెట్టుకుంటోంది.. ట్రంపిజం! అయితే, మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఆయన తాజా ఉపన్యాసం... 

 


అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ ఈ మధ్య చేసిన ఉపన్యాసం కొంత బెటర్ అనే అభిప్రాయం వినపడింది. ఎందుకంటే, మన తెలుగు వాడు శ్రీనివాస్ హత్య జాత్యహంకార దాడేనని ఆయన అంగీకరించారు. అంతే కాదు, అందరి రక్షణ ప్రభుత్వ బాధ్యతని కూడా ఒప్పుకున్నాడు. కాని, అదే సమయంలో తాను కడతానన్న గోడ గురించి, వలసదారుల వల్ల జరుగుతోన్న నష్టం గురించి, ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి పాత పాటే పాడాడు. కఠినమైన చర్యలు తప్పవనీ, అమెరికా ఫస్ట్ అనీ చెప్పుకొచ్చాడు! 

 


అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ ఇచ్చిన స్పీచ్ లో మరో ముఖ్య విషయం కూడా వుంది. ఆయన చెప్పిందేంటంటే... అమెరికా తన సరిహద్దుల్ని గట్టిగా కాపాడుకోకపోతే, వలస వస్తోన్న వార్ని నియంత్రించకపోతే అసలైన అమెరికన్స్ కి తీవ్ర నష్టమని. ఉదాహరణగా.. జేమియల్ షా, జెస్సికా డేవిస్, సుసాన్ ఓలివర్ అనే వార్ని ప్రస్తావించాడు. వారంతా సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ప్రవేశించిన వలసదారుల వల్ల చనిపోయిన అమెరికన్ల తాలూకూ కుటుంబ సభ్యులు! ఇలాంటి వార్ని కాపాడుకోవటం మన బాధ్యత కాదా అంటూ ట్రంప్ కాంగ్రెస్ ని ప్రశ్నించాడు. అందుకే, వలస వస్తోన్న వారిపై నిఘా, నియంత్రణ అవసరమని తన చర్యల్ని సమర్థించుకున్నాడు!

 


ట్రంప్ వలస వచ్చిన వారి చేతిలో చనిపోయిన అమెరికన్స్ గురించైతే మాట్లాడాడుగాని... వలస వచ్చి అమెరికన్ల చేతిలో మరణించిన అభాగ్యుల గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. నిజానికి వలసొచ్చిన వారు అమెరికాలో చేసే నేరాల కన్నా అమెరికాలో పుట్టి, పెరిగిన లోకల్ అమెరికన్స్ చేసే దారుణాలే ఎక్కువ. ఇది పక్కాగా నిరూపించబడ్డ క్రూరమైన సత్యం. తాజాగా వైట్ అమెరికన్ చేతిలో చనిపోయిన మన ఇండియన్ , శ్రీనివాస్ కూచిభోట్ల లాంటి వారు ఎందరెందరో వున్నారు అమెరికాలో! 

 


2008లో పెన్సిల్ వేనియాలో మెక్సికో నుంచి వలసొచ్చిన లూయిజ్ రమిరెజ్ ను నలుగురు అమెరికన్ ఫుట్ బాలర్ ప్లేయర్స్ కొట్టి చంపారు. కొరియాకు చెందిన వాన్ జూన్ యూన్ అనే విద్యార్థి ఇండియానా యూనివర్సిటిలో గ్రాడ్యుయేషన్ చేస్తుండేవాడు. అతడ్ని జాత్యహంకారంతో ఒక వైట్ అమెరికన్ చంపేశాడు. సౌదీ నుంచి అమెరికా వచ్చిన హుస్సేన్ సయీద్ అనే విద్యార్థి కూడా తెల్లవారి చేతిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. మార్సెలో ల్యుసిరో అనే ఈక్వెడార్ ఇమిగ్రెంట్ కూడా న్యూయార్క్ లో అమెరికన్ టీనేజర్ల చేతిలో చచ్చిపోయాడు. అందుక్కారణం, అమెరికన్ టీనేజర్స్ బీనర్ హాపింగ్ అనే క్రూరమైన ఆట ఆడటమే. ఆ ఆటలో భాగంగా వారు ల్యాటిన్ దేశాల నుంచి వలసొచ్చిన మగవాళ్లని రాత్రి పూట వేటాడి చావబాదుతారు!

 


ఇలా చెబుతూ పోతే... అమెరికాకి వలసొచ్చి శాశ్వతంగా ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిన వారు ఎందరో! ఇండియా మొదలు ఈక్వెడార్ వరకూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో అమెరికన్ జాత్యహంకార దాడులకి బలైన వారి కుటుంబాలు కనిపిస్తాయి. అయినా సరే, ట్రంప్ మాత్రం వలసొచ్చిన వారిలో ఉన్మాదులెవరో అతి తక్కువగా చేసే దాడుల్ని భూతద్దంలో చూపిస్తూ తన రాక్షసానందాన్ని సమర్థించుకుంటున్నాడు! ఇది ఇప్పటికైతే బావుండొచ్చు కాని... సుదీర్ఘ కాలంలో అమెరికా అగ్రరాజ్య హోదాకే ఎసరు పెట్టే అవకాశాలు లేకపోలేదు. అమెరికాకి వచ్చే వలస జనాలకి మహా అయితే అమెరికా డాలర్లు విదిలిస్తుంది. కాని, వారు తమ జీవితాల్నే అమెరికా కోసం ధారపోస్తారు. వారు లేకుంటే, రాకుంటే, అమెరికా వద్దనుకుంటే... అప్పుడు తెలుస్తుంది ఆ లోటు పూడ్చుకోవటం ఎంత ఇబ్బందో!