TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మ..మ..మ మాస్..చోడవరంలో బాబు స్పీచ్ అదుర్స్

Published on: Thu Jun 16, 2022 7:57AM

తెలుగుదేశం అధినేత రాష్ట్రపర్యటన ఆరంభం అదిరింది.  ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రన్న భరోసా కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి అంచనాలకు మించి జనం హాజరయ్యారు. అధికార పక్షంపై చంద్రబాబు విమర్శలకు ప్రజల నుంచి స్పందన లభించింది. చోడవరం సభతో జగన్ ప్రభుత్వ పతనం ఆరంభమైనట్లేనన్న చంద్రబాబు ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.  గతానికి భిన్నంగా చంద్రబాబు తన ప్రసంగంలో మాస్ మసాలా దట్టించారు. జగన్ పాలనపై ఘాటు విమర్శలతో చెలరేగిపోయారు.

ఉత్తరాంధ్రలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు గడపగడపనా నిరసన సెగ తగిలితే.. తెలుగుదేశం చోడవరంలో నిర్వహించిన సభకు గడప గడప నుంచీ జనం స్వచ్ఛందంగా వచ్చారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ భేరి పేర మంత్రులుబస్సు యాత్ర సభ నుంచి జనం పారిపోతే.. చోడవరంలో చంద్రబాబు సభకు ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచీ జనం పరుగుపరుగున వచ్చారని పేర్కొన్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. జగన్ పాలనపై నిప్పలు చెరిగిన చంద్రబాబు.. క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. ఇంకా ఏమన్నారంటే..

రోడ్లపై గుంతలు పూడ్చలేని సర్కార్ మూడు రాజధానులను నిర్మిస్తుందా అంటూ చంద్రబాబు నిలదీశారు. తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు జగన్ పై, జగన్ సర్కార్ పై ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారు. జగన్ ను రాజకీయాలలో బచ్చాగా అభివర్ణించారు. అయ్యన్న పాత్రుడిపై రోజుకో కేసు పెడుతున్నారన్నారు. కేసులకు భయపడేది లేదు.. ఏం పీక్కుంటారో పీక్కో మని అయ్యన్న పాత్రుడు ధైర్యంగా నిలబడ్డారని చెప్పారు. ఇప్పటి దాకా చంద్రబాబు విమర్శలు అంశాల వారీగా, సునిశితంగా ఉంటూ వచ్చాయి. చోడవరం సభలో మాత్రం ఆయన పరుష పదజాలంతో ప్రసంగించారు. అంతే కాదు సర్కార్ వేధింపులకు భయపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

తాను అండగా నిలబడతానని ధైర్యం చెప్పారు.  ప్రశాంతంగా ఉండే విశాఖను ఏం చేద్దామని విజయసాయి, సుబ్బారెడ్డిలు వచ్చారని ప్రశ్నించారు. వారికి విశాఖలో ఏంపని అని నిలదీశారు. అమరావతిలో ఓ బుట్ట మట్టి తీయని జగన్ మూడు రాజధానులు ఏం కడతారని చంద్రబాబు సెటైర్లు వేశారు.  ఊళ్లో ఒక రోడ్డు వేసినా, మంచి నీటి పథకం వచ్చినా, సాగునీరు వచ్చినా టిడిపి వల్లనేనని చంద్రబాబు అన్నారు. సామాజిక న్యాయం తెలుగుదేశం వల్లే సాధ్యమన్నారు.  

 పచ్చని కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది వైసీపీ, బంగారం పండే తూర్పు గోదావరిలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించడానికి కారణం వైసీపీ అంటూ నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల వద్ద పెట్టారన్నారు. విద్యావ్యవస్థను నాశనం చేయడం వల్లే టెన్త్ ఫలితాలు ఇంత దారుణంగా వచ్చాయని మండి పడ్డారు.

జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఈ మూడేళ్లలో జగన్ ఇచ్చింది కేవలం వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమేనని చంద్రబాబు నిప్పులు చెరిగారు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మద్యాంధ్రపదేశ్ చేసేశారన్న చంద్రబాబు..మద్యం విషయంలో జగన్ అవినీతిలోనే కొత్త చరిత్ర సృష్టించారన్నారు.   మద్యంలో సొంత బ్రాండ్లు తెచ్చారు. మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్, షాపులు నిర్వహణ అన్నీ జగనే చేస్తున్నారని ఆరోపించారు. ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జి పెంచారు. చెత్త పన్ను వేశారు. ఇప్పుడు వాహనాల ఫ్యాన్సీ నెంబర్ కూడా పెంచారు. పరిశ్రమలకు ఇచ్చే నీటి రేట్లను పెంచిన ప్రభుత్వం ఇది.మనల్ని పన్నులతో బాదుతున్న బాదుడే బాదుడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చంద్రబాబు విమర్శించారు. 

వివేకా హత్య గుండెపోటు అని నాటకం ఆడింది ఎవరు….ఇప్పటికి అయినా ఇది గొడ్డలి పోటు అని జగన్ అంగీకరించాలి. వివేకా హత్య కేసులో సాక్షులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాక్ష్యులను కూడా బతకనివ్వడం లేదు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. దళిత డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీకి పాలాభిషేకం చేసిన వైసిపి తమకు ఏం గతి పడుతుందో గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. రివర్స్ పాలన చేస్తున్న జగన్ కు రివర్స్ ట్రీట్మెంట్ తప్పదని హెచ్చరించారు.  పోలీసులు రక్షకులుగా ఉండాలి తప్ప ప్రభుత్వ తొత్తులుగా కాదని హితవు పలికారు.