ఈవీఎంల తరలింపు కలకలం.. వారణాసిలో వీడియో సాక్ష్యం

 

ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడేకొద్దీ ఎన్నికల సంఘం సరికొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈవీఎంల తరలింపు విషయంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల వద్దకు తీసుకొచ్చిన వీడియోలు కలకలం సృష్టించాయి.

ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని వారణాసిలో ఈవీఎంల తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చందౌలీ నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ ముగియగా.. సిబ్బంది మంగళవారం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మొబైల్ లో చిత్రీకరించారు. పోలింగ్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈవీఎంలు తీసుకురావడంపై అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని తెలిపారు. పోలింగ్‌ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు.

కాగా.. గత డిసెంబరులో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలతో పాటే రిజర్వ్‌ యూనిట్లను కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సాయుధ బలగాల పటిష్ఠ భద్రతలో ఉండాలి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు. బీహార్, హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.

అయితే.. ఈవీఎంల తరలింపు వార్తలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపింది.